Biocon | మధుమేహ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ విషయంలో ప్రముఖ ఫార్మా కంపెనీ బయోకాన్ బయాలజిక్స్ నుంచి జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ ఎస్ ఈశ్వర రెడ్డి ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సాక్ష్యాధారాలు లభించడంతో మంగళవారం ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. కిరణ్ మజుందార్ షా సారధ్యంలోని బయోకాన్ అనుబంధ సంస్థ బయోకాన్ బయాలజిక్స్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిని నివారించడానికి అభివృద్ధి చేసిన ఇంజక్షన్ అస్పార్ట్కు థర్డ్ క్లినికల్ ట్రయల్స్ రద్దు చేసినందుకు ఈశ్వర రెడ్డికి రూ.4 లక్షల ముడుపులు అందాయని సీబీఐ ఆరోపణ. కానీ బయోకాన్ బయాలజిక్స్ మాత్రం సీబీఐ ఆరోపణలను తోసిపుచ్చుతున్నది.
బయోకాన్ బయాలజిక్స్ అభివృద్ధి చేసిన అస్పార్ట్ ఇంజక్షన్ వల్ల టైప్-1, టైప్-2 డయాబెటిక్ వ్యాధులను నియంత్రించ వచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో సైనర్జీ నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దినేశ్ దువాను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బయోకాన్ బయాలజిక్స్ నుంచి ముడుపులను ఈశ్వర రెడ్డికి దినేశ్ దువా అందించారు.
ఈ విషయమై పూర్తి ఆధారాలు సంపాదించిన తర్వాత అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసింది సీబీఐ. ఈశ్వర రెడ్డి, దువాలను సోమవారం ట్రాప్ ఆపరేషన్ ద్వారా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కేంద్ర దర్యాప్తు సంస్థ. అవినీతి, నేరపూరిత కుట్ర కేసుల్లో ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద బయోకాన్ బయాలజిక్స్ నేషనల్ రెగ్యులేటరీ ఎఫైర్స్ హెడ్/ అసోసియేట్ వైస్ప్రెసిడెంట్ ఎల్ ప్రవీణ్ కుమార్, ఢిల్లీలోని బయోఇన్నోవాట్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గుల్జిత్ సేథీలపై కేసులు నమోదు చేసింది.