Nothing OS | స్మార్ట్ ఫోన్ వాడాలంటే ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఉండాల్సిందే. ఆపిల్ ఐ-ఫోన్లలో ఐఓఎస్, ఇతర స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్‌లో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) భావిస్తున్నది. తద్వారా చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే సరసన చేరనున్నది. సొంతంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) రూపొందించాలని భావిస్తున్నట్లు నథింగ్ ఫౌండర్ కార్ల్ పై చెప్పారు.
టెక్ క్రంచ్ అనే సంస్థ నిర్వహించిన సదస్సులో కార్ల్ పై మాట్లాడుతూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పనకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. దీంతో తాము అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లను జోడిస్తామన్నారు. సొంత ఓఎస్ వల్ల వాడకం దార్లకు మెరుగైన యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి వీలవుతుందన్నారు. తమకు నిధుల కొరత ఉన్నా.. తమ కంపెనీ ఈ ఓఎస్ అభివృద్ధిపై పని చేయగలదన్నారు.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌దే ఆధిపత్యం. ఆపిల్ సొంతంగా ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసుకున్నది. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే కూడా సొంతంగా హార్మనీ ఓఎస్ తయారు చేసింది. హువావే యాప్ గ్యాలరీ ద్వారా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సొంతంగా ఓఎస్ అభివృద్ధి చేసుకునే విషయంలో నథింగ్ విజయం సాధిస్తే.. హువావే సరసన చేరినట్లేనని భావిస్తున్నారు.