Affordable Cars | పదేండ్ల క్రితం రూ.3.5-4 లక్షల్లోపు ధరకే యావరేజ్ బడ్జెట్ కారు లభిస్తుంది. తదుపరి ఐదేండ్లలో అది రూ.6-6.5 లక్షలకు పెరిగింది. ఇప్పుడు చౌక ధరకు కారు అంటే రూ.9-9.5 లక్షలు. ఇలా సగటున చౌకధరకు కారు ధర పెరగడానికి ప్రజల చాయిస్లో మార్పు రావడమే కారణం. `ఎక్స్పో – 2023`లోనూ ఈ మార్పు కనిపిస్తున్నది. చౌక కార్లకు మారు పేరు మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండాయ్ మోటార్స్. ఈ సంస్థలు రూ.10 లక్షల పై చిలుకు విలువ గల కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి.
అత్యధిక కార్ల తయారీ సంస్థలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, సీఎన్జీ వేరియంట్లపైనే ఫోకస్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ తొలిసారిగా డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ వేరియంట్ కారును మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఎక్స్‌పోలో పెద్ద కార్లు తయారు చేస్తున్న అత్యంత చౌక కార్ల గురించి తెలుసుకుందాం.. ఆ జాబితాలో ఫేస్‌లిఫ్ట్, కాన్సెప్ట్ వేరియంట్లు ఉన్నాయి.
బుల్లి కార్లలో సీఎన్జీ వర్షన్ వేరియంట్లను తయారు చేయడంపై టాటా మోటార్స్ ఫోకస్ చేసింది. మినీ ఎస్యూవీ పంచ్, హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ కార్లను ఎక్స్‌పోలో ప్రవేశ పెట్టింది. డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీతోనూ కార్లు పని చేస్తాయి. ఇది కారులో బూట్ స్పేస్ పెంచుతుంది. దేశంలోని కార్ల తయారీలో సీఎన్జీ వేరియంట్లలో డ్యుయల్ సిలిండర్ సిస్టమ్ అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి. ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్, మినీ ఎస్యూవీ పంచ్ కార్ల ధరలు వెల్లడించకున్నప్పటికీ సుమారు రూ.10 లక్షలు ఉండొచ్చునని అంచనా. ఈ రెండు కార్లు బ్లాక్ రూఫ్ విత్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి `ఆటో ఎక్స్పో`లో బాలెనో స్పెషల్ ఎడిషన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.10 లక్షల్లోపు ఉంటుందని అంచనా.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రొటోటైప్ కారు `ఈ85 ఫ్యూయల్`తో పని చేస్తున్నది. ఇటువంటి కార్లు 20085 ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్‌తో పని చేస్తాయి. ఈ ప్రొటోటైప్ కారు ధర వెల్లడించకున్నా రూ.10 లక్షల్లోపు ఉండొచ్చునని భావిస్తున్నారు.
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి ఆఫ్ రోడర్ ఎస్యూవీ జిమ్నీ కారును ఆవిష్కరించింది. రూ.11 వేలతో ఈ కారు బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ.12 లక్షలు ఉండొచ్చునని తెలుస్తున్నది. అల్ఫా-జెటా వేరియంట్లలో ఏడు రంగుల్లో ఆవిష్కరించింది. 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లలోనూ లభిస్తుంది.
ఎంజీ మోటార్స్ ఇండియా ఆటో ఎక్స్‌పోలో న్యూ హెక్టార్, హెక్టార్ ప్లస్ ఎస్యూవీ వేరియంట్లను ఆవిష్కరించింది. న్యూహెక్టార్ కారు ధర రూ.14.73 లక్షలు, ఏడు సీటర్ల హెక్టార్ ప్లస్ రూ.17.50 లక్సలు, ఆరు సీటర్ల హెక్టార్ ప్లస్ కారు ధర రూ.20.15 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఎంజీ4, ఎంజీ5 ఎలక్ట్రిక్ కార్లనూ ఆవిష్కరించింది. అన్ని ఎలక్ట్రిక్ కార్ల ధరలనూ రూ.15 లక్షల క్యాటగిరీలోకి తేనున్నది.