ముంబై, డిసెంబర్ 17: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ బుధవారం మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) నిబంధనలకు పలు సవరణల్ని చేసింది. వ్యయ నిష్పత్తి విధివిధానాల మార్పులు, బ్రోకరేజీ చార్జీలపై పరిమితుల్ని విధించింది. సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) నుంచి సెక్యూరిటీ లావాదేవీ పన్ను, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ వంటి చట్టబద్ధ చార్జీలను వేరు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
అలాగే బేస్ ఎక్స్పెన్స్ రేషియో (బీఈఆర్) కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. అటు క్యాపిటల్, ఇటు డెట్ మార్కెట్లలో మదుపరుల భాగస్వామ్యం మరింత పెరిగేలా సెబీ ఈసారి బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నదని ఇండస్ట్రీ విశ్లేషకులు చెప్తున్నారు. ఎంఎఫ్‌లు మరింత పారదర్శకమయ్యాయని అంటున్నారు. ఐపీవో నిబంధనల్ని, డెట్ మార్కెట్లో నిధుల సమీకరణనూ సరళతరం చేస్తూ సెబీ చర్యలు చేపట్టింది.