ముంబై, మే 8: ప్రధాన వడ్డీ ఆదాయం పెరగడం, కేటాయింపులు తగ్గడంతో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీ లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్ నికర లాభం 74 శాతం వృద్ధిచెంది రూ.3,336 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.1,919 కోట్ల నికర లాభాన్ని కనబర్చింది. నికర వడ్డీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.8,617 కోట్లకు చేరగా, ఇతర ఆదాయం 7 శాతం పెరిగి రూ.4,776 కోట్లకు చేరినట్టు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో కె సత్యనారాయణ రాజు చెప్పారు.
అడ్వాన్సులు 17 శాతం వృద్ధి చెందాయని, నికర వడ్డీ మార్జిన్ 0.14 శాతం మేర మెరుగుపడి 3.07 శాతానికి చేరిందన్నారు. స్థూల ఎన్పీఏలు 7.51 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గగా, కేటాయింపులు 3,727 కోట్ల నుంచి రూ.3,097 కోట్లకు దిగొచ్చాయి. కాగా, ఇన్వెస్టర్లకు షేరుకు రూ.12 చొప్పున బ్యాంక్ బోర్డు డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. ఇక గృహ రుణాలకు డిమాండ్ తగ్గిందంటూ పరిశ్రమలో కొన్ని వర్గాల నుంచి విన్పిస్తున్న వాదనపై రాజు స్పందిస్తూ తమ బ్యాంక్‌లో అటువంటి ట్రెండ్ ఏదీ కన్పించలేదని చెప్పారు.