Amazon ban Visa Credit Card | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. సంచలన నిర్ణయం తీసుకున్నది. బ్రిటన్‌లో ప్రముఖ పేమెంట్స్ కార్డ్ నెట్వర్క్ వీసా ఇంక్ జారీ చేసిన క్రెడిట్ కార్డు నుంచి తమ వస్తువుల కొనుగోళ్లకు వచ్చే ఏడాది నుంచి పేమెంట్స్ అనుమతించరాదని నిర్ణయించింది. వీసా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులపై భారీగా చార్జీలు వసూలు చేస్తుండటమే దీనికి కారణం. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి వీసా క్రెడిట్ కార్డుల నుంచి పేమెంట్స్ నిలిపివేయాలని నిర్ణయించామని, ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి ఓ ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపారు.
కనుక తమ కస్టమర్లు ఇక నుంచి వీసా కార్డుకు బదులు మాస్టర్ కార్డ్, యూరో కార్డ్, అమెక్స్ క్రెడిట్ కార్డులను చెల్లింపులకు వినియోగించాలని అమెజాన్ సూచించింది. వీసా క్రెడిట్ కార్డుతో అమెజాన్ తన భాగస్వామ్యాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.ఇంతకుముందు 2019లో క్రోగర్ అనే సంస్థ.. లావాదేవీలపై అధిక ఫీజు వసూలు చేస్తున్నదన్న ఆరోపణపైనే వీసా క్రెడిట్ కార్డులపై పేమెంట్స్‌ను పూర్తిగా నిలిపివేసింది.
వేలాది మంది మర్చంట్లు సైతం వీసా.. తన క్రెడిట్ కార్డు చెల్లింపులపై భారీగా ఫీజు వసూలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. అమెజాన్ నిర్ణయంపై స్పందించడానికి వీసా క్రెడిట్ కార్డు యాజమాన్యం అందుబాటులోకి రాలేదు.