Panama Papers Leaks | పనామా పేపర్స్‌లో పేరొచ్చిన వ్యాపార వేత్త సంజయ్ విజయ్ షిండే నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.88 లక్షల నగదు సీజ్ చేసింది. ఇంతకుముందు ఆయనకు గోవా కేంద్రంగా పని చేస్తున్న వీఎస్ గోవా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అనుబంధం ఉండేది. సంజయ్ విజయ్ షిండేపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఆదాయం పన్నుశాఖ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈడీ అధికారులు కూడా భోపాల్, గోవాల్లో నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
పన్ను ఎగవేత కోసం విదేశాల్లో సంస్థలు ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తల జాబితాలో 2016లో సంజయ్ విజయ్ షిండే పేరు బయట పడింది. వివిధ విదేశీ సంస్థల్లో బెనిఫిట్ పొందిన వ్యక్తుల పేర్లను బయట పెట్టిన పనామా పేపర్ లీక్స్‌లో ఆయన పేరు వచ్చింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ కేంద్రంగా పని చేస్తున్న సంస్థ, సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న బ్యాంకు ఖాతా, వివిధ విదేశీ సంస్థల్లో రూ.31 కోట్లు జమ చేశారని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.
పనామా పేపర్ లీక్స్‌లో బయటపడ్డ వ్యక్తులపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆధ్వర్యంలో బహుళ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయని అప్పట్లో కేంద్రం హామీ ఇచ్చింది. భోపాల్, గోవాల్లో జరిపిన తనిఖీల్లో రూ.88.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆయనపై బ్లాక్ మనీ (గుర్తు తెలియని విదేశీ ఆదాయం, ఆస్తులు), తదితర చట్టాల కింద సంజయ్ విజయ్ షిండేపై కేసు నమోదు చేసినట్లు ఆదాయం పన్ను శాఖ వెల్లడించింది.