
హైదరాబాద్, డిసెంబర్ 9: వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ సంస్థలు సత్తా చాటుతున్నాయి. దేశ, విదేశాల్లో విస్తరిస్తూ అటు అభివృద్ధిపరంగా, ఇటు ఆర్థికంగా దూసుకుపోతున్నాయి. తాజాగా విడుదలైన 2021 బుర్గుండి ప్రైవేట్-హురున్ ఇండియా 500 తొలి జాబితాలో రాష్ర్టానికి చెందిన 29 కంపెనీలున్నాయి. వీటన్నిటి విలువ రూ.6.9 లక్షల కోట్లుగా ఉన్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ బిజినెసైన బుర్గుండి ప్రైవేట్ గురువారం తెలియజేసింది. రూ.1,36,699 కోట్లతో దివీస్ ల్యాబ్ అగ్రస్థానంలో ఉన్నది. ఒక్కో సంస్థ సగటున 6,918 మందికి ఉపాధిని కల్పించడం విశేషం. ఇక 15 సంస్థలు ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందినవే కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ నమోదిత సంస్థలను మార్కెట్ విలువతో లెక్కించగా, నమోదుకాని వాటిని వాల్యుయేషన్స్ ఆధారంగా ర్యాంకులిచ్చినట్లు పేర్కొన్నది. కాగా, జాబితాలోని మొత్తం 500 సంస్థలు ప్రభుత్వేతర దేశీయ కంపెనీలే. వీటి విలువ రూ.228 లక్షల కోట్లుగా ఉన్నది. ఈ ఏడాది అక్టోబర్ 30 నాటికి ఉన్న మార్కెట్ విలువ, ఆస్తులు, అమ్మకాలు, ఆదాయం, లాభాల ఆధారంగా ఈ జాబితా తయారైంది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విలువ అత్యధికంగా రూ.16.7 లక్షల కోట్లుగా ఉన్నది. రూ.13.1 లక్షల కోట్లతో టీసీఎస్, రూ.9.1 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కరోనా ప్రభావంలోనూ అగ్రశ్రేణి భారతీయ సంస్థల విలువ ఈ ఏడాది 68 శాతం పెరుగగా, ఏకంగా 200 సంస్థల విలువ రెట్టింపైంది. ఇక స్టాక్ మార్కెట్లలో నమోదు కాని సంస్థల్లో రూ.1.8 లక్షల కోట్ల విలువతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ముందున్నది. జాబితాలోని మొత్తం 500 సంస్థల్లో ముంబైకి చెందినవే 167. 52 సంస్థలతో బెంగళూరు, 38 సంస్థలతో చెన్నై తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక సేవల రంగానికి చెందినవి 77 కంపెనీలుంటే, హెల్త్కేర్వి 64 ఉన్నాయి. మొత్తం సంస్థల వార్షిక అమ్మకాలు రూ.58 లక్షల కోట్లు. ఈ సంస్థలు 69 లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి.
