Budget Speech | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరా (2025-26)నికి వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌కు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రతియేటా ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తూ ముఖ్యాంశాలతో ప్రసంగిస్తారు. హీరూభాయి పటేల్ నుంచి నిర్మలా సీతారామన్ వరకూ ప్రతి ఆర్థిక మంత్రి తమదైన శైలిలో బడ్జెట్ ప్రసంగాలు చేస్తారు.
ఒక తాత్కాలిక బడ్జెట్, ఏడు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పించే బడ్జెట్ ఎనిమిదవది కానున్నది. గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించిన నిర్మలమ్మ.. కేవలం 60 నిమిషాల్లోనే తన బడ్జెట్ ప్రసంగం ముగించారు. ఇదే నిర్మలా సీతారామన్ 2020లో తన బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేయడానికి తన పాత రికార్డునే బ్రేక్ చేశారు. 2020లో నిర్మలా సీతారామన్ 2:42 గంటల పాటు బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు. భారత దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద బడ్జెట్ స్పీచ్‌గా నిలిచిపోయింది.
2019లో భారత్ ఆర్థిక చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోనున్నది. తొలిసారి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించారు. వచ్చే దశాబ్ది కోసం పది సూత్రాల పథకంతోపాటు ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు లబ్ధి చేకూరుస్తూ బడ్జెట్ రూపొందించారు. 2019లో 2:17గంటల్లో ఆమె బడ్జెట్ స్పీచ్ పూర్తి చేశారు.
అటల్ బీహారీ వాజ్‌పేయి సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2003లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్.. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ-ఫైలింగ్ విధానం తెచ్చారు. విశ్వజనీన ఆరోగ్య బీమా పథకం ప్రతిపాదించారు. కొన్ని వస్తువులపై ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. జస్వంత్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగం 2:10 గంటల్లో పూర్తి చేశారు.
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2014లో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. అలాగే రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను 49 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జైట్లీ తన బడ్జెట్ స్పీచ్ 2:10 గంటల్లో ముగించారు.
ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి జాతి రూపురేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషించిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్..1991లో పీవీ నర్సింహారావు క్యాబినెట్లో కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆర్థికంగా దేశ దిశ దశలను మార్చేసిన మన్మోహన్ సింగ్.. 1991 జూలై 24న తన తొలి బడ్జెట్ ప్రసంగం 18,700 పదాలతో పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ తర్వాత 18,604 పదాలతో సుదీర్ఘ బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన వారిలో అరుణ్ జైట్లీ రెండో వారు. 1977లో ఆర్థిక మంత్రిగా హీరూభాయి ఎం పటేల్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. కేవలం 800 పదాలతోనే బడ్జెట్ స్పీచ్ పూర్తి చేశారు.