BT Group Lay-Offs | లండన్ కేంద్రంగా పని చేస్తున్న బ్రిటిష్ మల్టీ నేషనల్ టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ `బీటీ గ్రూప్` భారీగా లే-ఆఫ్స్ ప్రకటించింది. వచ్చే ఐదేండ్ల నుంచి ఏడేండ్లలోపు అంటే 2028-30 కల్లా 55 వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపాలని నిర్ణయించింది. ఖర్చులు తగ్గిస్తూ, సంస్థను లాభదాయకంగా నిలపాలని నిర్ణయించినట్లు గురువారం ప్రకటించింది. ప్రస్తుతం బీటీ గ్రూప్లో 1.30 లక్షల మంది పని చేస్తున్నారు. 2028-2030 నాటికి ఉద్యోగుల సంఖ్య 75 వేల నుంచి 90 వేలకు కుదించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది బీటీ గ్రూప్.
తమ సంస్థను డిజిటలైజ్ చేస్తూ మరింత శక్తిమంతంగా మార్చాలని నిర్ణయించామని బీటీ గ్రూప్ సీఈవో ఫిలిప్ జాన్సెన్ తెలిపారు. సంస్థ పనితీరును సరళతరం చేయాలని సంకల్పించామన్నారు. ఖర్చులు గణనీయంగా తగ్గిస్తూ తక్కువ సిబ్బందితో మెరుగైన భవిష్యత్ కోసం లాభదాయక బిజినెస్ చేయాలన్న భావనంతో ముందుకెళ్తామన్నారు. 2030 నాటికి దేశంలో పూర్తి స్థాయిలో ఫైబర్ నెట్వర్క్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు.