BSNL Freedom Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ప్రత్యేకంగా ‘ఫ్రీడమ్ ప్లాన్’ పేరుతో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు కేవలం రూపాయికే 30 రోజుల పాటు 4జీ సేవలను పొందే వీలు కల్పిస్తున్నది. అయితే, పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఇన్స్టాల్ చేసింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు అపరిమిత లోకల్-ఎస్టీడీ కాల్స్, రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు వంద ఎస్ఎంఎస్లు, ఉచితంగా సిమ్ సైతం లభిస్తుంది.
ఈ ఆఫర్ ఆగస్టు ఒకటి నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వరంగ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కోసం యూజర్లు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఔట్‌లెట్‌కు వెళ్లి కొత్త కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని.. రూపాయి చెల్లించి ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ ప్లాన్‌లో కీలక కేవలంలో కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకునే వారికి మాత్రమే వర్తించనున్నది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సేవలు వాడుతున్న లేదంటే ఇతర నెట్వర్క్ నుంచి పోర్ట్ అవ్వాలనుకునే వారికి ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది. ఈ ప్లాన్ ముగిసిన తర్వాత మిగతా సేవలను కొనసాగించేందుకు తప్పనిసరిగా రెగ్యులర్ ప్లాన్స్‌లో ఏదో ఒకదాన్ని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో రూ.147 ప్లాన్‌తో రీచార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ టైర్-2, టైర్-3 నగరాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది.
ఇందులో భాగంగా మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన స్వదేశీ 4జీ టెక్నాలజీని వినియోగిస్తున్నది. డిజిటల్ ఇండియా దిశగా కీలక అడుగుగా పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షకుపైగా టవర్లు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ సంస్థలు రూ.349, రూ.379, రూ.399లకు 4జీ ప్లాన్స్‌ని అందిస్తుండగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రమే రూపాయికే కొత్త ప్లాన్ తీసుకువచ్చి ప్రైవేట్ సంస్థలకు షాక్ ఇచ్చింది. గమనించదగ్గ విషయం ఏంటంటే.. ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5జీ సేవలతో పాటు ఓటీటీ యాప్‌లను కూడా ఉచితంగా అందిస్తున్నప్పటికీ.. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం కేవలం 4జీ సేవలకే పరిమితమైంది. ఇటీవలి కాలంలో కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీఎస్ఎన్ఎల్ మొబైల్ సేవల బిజినెస్‌ను వచ్చే ఏడాది 50శాతంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంటర్ప్రైజ్ బిజినెస్‌ను 25-30శాతానికి, ఫిక్స్డ్ లైన్ బిజినెస్‌ను 15-20శాతం వరకు పెంచాలని సూచించారు.