హైదరాబాద్, జూన్ 26: రాష్ర్టానికి చెందిన ఏఐ నిఘా, భద్రతా పరిష్కార సేవలు అందిస్తున్న బృహస్పతి టెక్నాలజీస్..హైదరాబాద్‌లో సీసీటీవీల ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. రూ.70 కోట్ల పెట్టుబడితో నగరానికి సమీపంలోని తునికి బొల్లారం వద్ద నిర్మిస్తున్న ఈ యూనిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. 2.5 ఎకరాల స్థలంలో 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పుతున్న ఈ యూనిట్‌తో కొత్తగా 400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
ఈ వ్యాపార విస్తరణకోసం విదేశీ పెట్టుబడిదారుల నుంచి 10 మిలియన్ డాలర్లు(రూ.86 కోట్లకు పైమాటే) నిధులను సమీకరించినట్టు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకి రానున్నట్టు ఆయన ప్రకటించారు. తద్వారా వచ్చిన నిధులను పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతోపాటు ఉత్పాదక సామర్థ్యాన్ని, ఏఐ ఆధారిత ఉత్పత్తులకోసం వినియోగించనున్నట్టు ప్రకటించారు. అలాగే మహారాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ నుంచి రూ.200 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. దీంతో ప్రస్తుతం సంస్థ వద్ద రూ.300 కోట్లకు పైగా ఆర్డర్లు ఉన్నాయన్నారు.