Brent Crude Hits | బ్రెంట్ క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం ఆసియా ట్రేడ్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ కాంట్రాక్ట్ ధర 86.84 డాలర్లు పలికింది. 2014 అక్టోబర్ నెలాఖరు తర్వాత క్రూడ్ ధర ఈ స్థాయికి చేరుకోలేదు. దేశీయంగా ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 13 పైసలు పతనం కావడం కూడా బ్రెంట్ క్రూడాయిల్ ధర రికార్డు స్థాయికి చేరడం మరో కారణంగా తెలుస్తున్నది.దీనికితోడు కోవిడ్-19 న్యూ వేరియంట్ ఒమిక్రాన్, భౌగోళిక, రాజకీయ టెన్షన్లు తగ్గుముఖం పట్టడం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయని భావిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచే బ్రెంట్, వెస్ట్ టెక్సాక్ ఇంటర్మీడియట్ ముడి చమురు ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటివరకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిగా కోలుకుని సాధారణ స్థాయికి చేరుతుండటంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం బలోపేతం అవుతున్నది. సోమవారం యెమెన్‌లోని హుథి తిరుగుబాటుదారులు అబుదాబిలోని ఫ్యూయల్ ట్యాంక్‌ను పేల్చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. స్వయంగా హుథి తిరుగుబాటుదారులు ఈ సంగతి చెప్పారు.
మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో 74.2380 వద్ద మొదలైన రూపాయి ట్రేడింగ్ తర్వాత డాలర్‌పై గరిష్ఠంగా 74.3650లకు చేరుకుని కనిష్టంగా 74.2180 వద్దకు దిగి వచ్చి చివరకు 74.3450 వద్ద స్థిర పడింది. రూపాయి విలువ తగ్గడంతో కరంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరగడం కూడా ముడి చమురు ధర పెరగడానికి కారణాలుగా ఉన్నాయి. రూపాయి విలువ బలహీనపడటంతో అమెరికా ట్రెజరీ బాండ్ల ధర కూడా బాగా పెరిగింది.