BPCL-Andhra Oil Refinery | ఆంధ్రప్రదేశ్‌లో ఏటా తొమ్మిది మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదించింది. అయితే, ఈ రిఫైనరీ ఏర్పాటుకు సుమారు రూ.95,000 కోట్లు ఖర్చవుతుందని బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వెస్టా రామకృష్ణ గుప్తా తెలిపారు. దేశంలోని ఆయిల్ కం పెట్రో కెమికల్ రిఫైనరీల్లో ఇదే కాస్ట్లీ ప్రాజెక్టుగా నిలుస్తుంది. రాజస్థాన్‌లోని బర్మార్లోనూ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) పెట్రో కెమికల్ రిఫైనరీ త్వరలో వినియోగంలోకి రానున్నది. బార్మార్ రిఫైనరీ ఏర్పాటు కోసం హెచ్‌పీసీఎల్ రూ.71,814 కోట్లు ఖర్చు చేసింది.
2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం మహారాష్ట్రలోని రత్నగిరిలో రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 60 మిలియన్ టన్నుల మెగా ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భావించింది. కానీ, భూ సేకరణ సమస్య వల్ల నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), ఫీడ్ బ్యాక్ అధ్యయనాల కోసం ప్రీ- ప్రాజెక్టు కార్యక్రమాల కింద రూ.6,100 కోట్లు ఖర్చు చేయడానికి బీపీసీఎల్ బోర్డు నిర్ణయించిందని వెస్టా రామకృష్ణ గుప్తా చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రాజెక్టు ఖర్చు రూ.95 వేల కోట్లు ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం మంచి క్యాపిటల్ ఇన్సెంటివ్‌లు అందిస్తున్నది. కానీ, బడ్జెటరీ మద్దతుపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి సంకేతాలివ్వలేదు.
వచ్చే డిసెంబర్లో డీపీఆర్, ఫీడ్‌బ్యాక్ స్టడీ నివేదికలు వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఎంత ఉంటుందో అంచనాకు రావచ్చునని రామకృష్ణ గుప్తా పేర్కొన్నారు. తాము జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని చూస్తున్నామని చెప్పారు కానీ వివరాలు వెల్లడించలేదు. తుది ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత 48 నెలలకు ప్రాజెక్టు ఉపయోగంలోకి వస్తుందన్నారు. కోస్తా తీర ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నామని, భూమి కూడా గుర్తించామని రామకృష్ణ గుప్తా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం 6,000 ఎకరాల భూమి అవసరం అని, భూ సేకరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు.