Boeing Logistics Centre | భారత్‌లో విమానాల లాజిస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ కో ప్రణాళిక రూపొందిస్తున్నది. భారత్‌లో న్యూ లాజిస్టిక్ సెంటర్ ఏర్పాటు కోసం 24 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు బోయింగ్ కో భారత్ విభాగం ప్రెసిడెంట్ సలీల్ గుప్తే చెప్పారు. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఈ వారం దాదాపు 500 విమానాల కొనుగోలుకు డీల్ ప్రకటించనున్న నేపథ్యంలో బోయింగ్ కో ప్లాన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
బోయింగ్ కో, ఎయిర్‌బస్ సంస్థల నుంచి ఈ 500 విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేయనున్నది. వీటి విలువ 100 బిలియన్ డాలర్ల పై చిలుకే ఉంటుందని అంచనా. బోయింగ్ కో నుంచి 737 మ్యాక్స్ నారోబాడీ విమానాలు 190, 787 వైడ్ బాడీ విమానాలు 20, 777ఎక్స్ విమానాలు 10 ఉన్నాయని తెలుస్తున్నది. ఎయిర్ ఇండియా ఆర్డర్ వివరాలను వెల్లడించడానికి సలీల్ గుప్తే ముందుకు రాలేదు.
పౌర విమానయాన మార్కెట్లలో భారత్‌కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. నారోబాడీ, వైడ్‌బాడీ విమానాలకు భారీ అవకాశాలు ఉన్నాయని సలీల్ గుప్తే తెలిపారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు విమానాల లభ్యత మెరుగుదల, మెయింటెనెన్స్ అంశాల వల్ల గ్రౌండింగ్ లేదా విమాన సర్వీసుల రద్దు వంటి అంశాలను తగ్గించడానికి భారత్‌లో లాజిస్టిక్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఎయిర్ ఇండియాతోపాటు స్టార్టప్ ఎయిర్‌లైన్స్ ఆకాశా ఎయిర్తోపాటు స్పైస్‌జెట్ సంస్థ నుంచి బోయింగ్ విమానాల కొనుగోలుకు ఆర్డర్లు వచ్చాయి. వచ్చే 20 ఏండ్లలో భారత విమానయాన సంస్థలకు 2,220 కొత్త విమానాలు అవసరం అని బోయింగ్ కో భావిస్తున్నది. నారోబాడీ ఫ్లయిట్లకు భారీ ఆర్డర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. `మధ్యతరగతి వృద్ధితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గ్రోత్‌కు భారత్ సారధ్యం వహిస్తుంది. మరింత మంది విమానయానానికి పోటీ పడుతుంటారు. తదనుగుణంగా విమాన సర్వీసులు అందించడానికి నారోబాడీ ఫ్లయిట్లు అవసరం` అని గుప్తే తెలిపారు.