BMW X1 Launch | బీఎండబ్ల్యూ తన సరికొత్త మూడో తరం ఎస్యూవీ X1 కారును భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ గత మోడల్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో X 1 కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త X1 బుకింగ్ కోసం డీలర్ స్థాయిలో రూ. 50 వేలు టోకెన్‌గా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) ఎంపికను మాత్రం తీసివేసింది. ఈ సరికొత్త కారు కేవలం 9 సెకండ్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.45.90 లక్షలుగా ఉంచారు. డీజిల్ వేరియంట్ ధర రూ.47.90 లక్షలు. బెంగళూరులో జరుగుతున్న బీఎండబ్ల్యూ జాయ్‌టౌన్ ఫెస్టివల్లో ఈ కారును ప్రదర్శించారు. చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో ఈ కారును తయారు చేస్తున్నారు. డీజిల్ వేరియంట్లను మార్చ్ నెల నుంచి, పెట్రోల్ కార్లను జూన్ నుంచి మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ మోడల్ కారు.. మెర్సిడెస్ బెంజ్ GLA, ఆడి Q3, వోల్వో XC40, మినీ కంట్రీ మ్యాన్ వంటి ప్రీమియం వాహనాలతో పోటీ పడుతున్నది. ఆల్పైన్ వైట్, స్పేస్ సిల్వర్, ఫైటోనిక్ బ్లూ, బ్లాక్ సఫైర్, ఎమ్ పోర్టిమావో బ్లూ రంగుల్లో లభ్యం కానున్నాయి.
గత మోడల్‌తో పాలిస్తే ఈ కారును మరింత ఆకర్శణీయంగా ఆధునీకరించారు. ముందు వైపున ఉన్న పెద్ద గ్రిల్, ఎల్ ఆకారపు డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్లు కారుకు స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్ సిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఈ కారు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వెనక వైపున ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, బంపర్ అదనపు హంగులుగా ఉన్నాయి. ఈ మోడల్ కారులో కర్వ్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అందిస్తున్నారు. డ్యాష్‌బోర్డు చాలా స్లిమ్‌గా తీసుకొచ్చారు. సెంటర్ కన్సోల్‌లో ఫిజికల్ బటన్లు ఇచ్చారు. వెనక సీట్లో చాలా స్పేస్ ఉన్నది. అదనంగా 476 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉన్నది.