Black out fear | బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గితే దేశమంతా అంధకారమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లకు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు కేంద్రం దిశా నిర్దేశం చేసింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు.. కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు కేంద్రానికి సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఇక 10 శాతం విదేశీ బొగ్గుతోపాటు దేశీయ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి పవర్ ప్లాంట్లకు కేంద్రం మంగళవారం అనుమతినిచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ధర పెరిగిపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల దేశంలోని పలు పవర్ ప్లాంట్లు.. పరిమితంగా బొగ్గు వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి.
పెరిగిపోయిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా పవర్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును కోల్ ఇండియా సరఫరా చేయలేకపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం తన విధాన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. కోవిడ్-19 ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడంతో విద్యుత్ వాడకానికి డిమాండ్ పెరిగింది.
కొన్ని రాష్ట్రాలు వినియోగదారులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదని తమ నోటీసుకు వచ్చిందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. అలాగే రాష్ట్రాలు లోడ్ షెడ్డింగ్పై ఆంక్షలు విధిస్తున్నాయని తేలింది. అదే సమయంలో సదరు రాష్ట్రాలు అధిక ధరలకు పవర్ విక్రయిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి 15 శాతం విద్యుత్ కేటాయింపులపై మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన అన్లొకేటెడ్ పవర్‌ను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంబంధిత రాష్ట్రాలకు సప్లయ్ చేయాలని కేంద్రం సూచించింది.
విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా తమ పరిధిలోని కస్టమర్లను పక్కనబెట్టి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించరాదని కూడా కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది. అనునిత్యం అవసరమైన యూజర్లకు విద్యుత్ సరఫరా చేయాలని తేల్చి చెప్పింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు.. అవసరమైన రాష్ట్రాలకు దాన్ని సరఫరా చేసే విషయమై కేంద్రానికి సమాచారం ఇవ్వాలని సూచించింది.