
న్యూఢిల్లీ, జనవరి 4: ప్రీమియం మొబైల్ ఫోన్ మార్కెట్లో ఒకప్పుడు ఓ ఊపు.. ఊపిన బ్లాక్‌బెర్రీ స్మార్ట్ఫోన్ల పనైపోయిందా?.. వాటి కథ కంచికి చేరినట్లేనా?.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న బ్లాక్‌బెర్రీ 7.1 ఓఎస్‌తోపాటు అంతకుముందున్న ఓఎస్ స్మార్ట్ఫోన్లు, బ్లాక్‌బెర్రీ 10 సాఫ్ట్వేర్, బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ ఓఎస్ 2.1సహా దీనికంటే ముందున్న వెర్షన్లకు సంస్థ నుంచి మద్దతు నిలిచిపోతున్నది. ఈ మేరకు బ్లాక్‌బెర్రీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇబ్బందులు కలగవచ్చని చెప్తున్నారు. వైఫై కనెక్షన్లు, డాటా, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, 9-1-1 వంటి సేవలకు అంతరాయం కలుగనుంది. మరోవైపు ఇన్నాళ్లూ తమతో ఉన్న కస్టమర్లందరికీ ఈ ప్రకటనలో బ్లాక్‌బెర్రీ కృతజ్ఞతలు కూడా తెలిపింది.
2016లోనే స్మార్ట్ఫోన్ల తయారీని బ్లాక్‌బెర్రీ ఆపేసింది. ఆ తర్వాత కేవలం సాఫ్ట్వేర్ వ్యాపారానికే పరిమితమైన ఈ కెనడా కంపెనీ.. తమ బ్రాండ్ లైసెన్స్, సేవలను టీసీఎల్ చేతుల్లో పెట్టింది. ఒప్పందం ప్రకారం 2020 వరకు టీసీఎల్ ఈ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్ ద్వారా పనిచేసే ఈ ఫోన్లు.. ఆగస్టుదాకా నడవనున్నాయి. 2013లోనే తమ ఓఎస్ అప్డేట్కు బ్లాక్‌బెర్రీ ప్రయత్నించింది. కానీ విఫలమైంది. చివరకు 2015లో గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌కు తమ స్మార్ట్ఫోన్లను మార్చేసింది. అయినప్పటికీ మార్కెట్లో సంస్థ నిలదొక్కుకోలేకపోయింది.