ముంబై, నవంబర్ 22: వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ చట్టాల రద్దు నేపథ్యంలో ప్రభుత్వ సంస్కరణల పట్ల ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు షేర్లను భారీగా విక్రయించడంతో సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ నిట్టనిలువునా పతనమయ్యింది. ఈ సూచి గత ఏడు నెలల్లోనూ ఎన్నడూ లేనంతగా 1,170 పాయింట్లు పడిపోయి, 58,466 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 12 తర్వాత ఇదే అతిపెద్ద పతనంకాగా, సెన్సెక్స్ ముగింపు రెండు నెలల కనిష్ఠం. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 348 పాయింట్లు క్షీణించి రూ. 17.417 పాయింట్ల వద్ద నిలిచింది. సెప్టెంబర్ 20 తర్వాత ఈ సూచి ఇంత కనిష్ఠస్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. సెన్సెక్స్-30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, టైటాన్, ఎస్బీఐ షేర్లు 5.7 శాతం వరకూ తగ్గాయి. మార్కెట్ ఇంతగా పడిపోవడానికి ట్రేడర్లు
పలు కారణాల్ని చూపుతున్నారు. అవి… వ్యవసాయ చట్టాల రద్దు
రైతులు ఆందోళనకు తలొగ్గిన కేంద్రం మూడు వ్యవసాయ చట్టా ల్ని రద్దుచేయడంతో ఆర్థిక సంస్కరణల పట్ల ఇన్వెస్టర్లకు అనుమానాలు తలెత్తడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని ట్రేడర్లు తెలిపారు. ఈ చర్య పీఎస్‌యూ షేర్లను ప్రభావితం చేస్తుందన్నారు. కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంస్కరణలపై కేంద్ర వెనుకంజవేస్తుందన్న భయాలు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయని విశ్లేషకులు వివరించారు.
రిలయన్స్-అరామ్కో డీల్ రద్దు
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో 20 శాతం వాటా విక్రయానికి అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకున్న ప్రభావం కూడా మార్కెట్‌పై పడింది. ఈ వాటాను 15 బిలియన్ డాలర్లకు విక్రయించే ప్రతిపాదనపై ఇరు కంపెనీలు కొద్దినెలల క్రితం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తాజాగా ఆ ఒప్పదం రద్దుకావడంతో రిలయన్స్ షేరు 4.42 శాతం పడిపోయి రూ.2,363 వద్ద ముగిసింది. ఈ షేరుకు సూచీల్లో అధిక వెయిటేజి ఉన్నందున, సెన్సెక్స్ పతనాన్ని రిలయన్స్ అధికంగా ప్రభావితం చేసింది. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.69,364 కోట్లు తగ్గి, రూ.14,99,186 కోట్లకు దిగింది.
పేటీఎం ఢమాల్
పేటీఎం వరుస పతనం సైతం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు లోనుచేసింది. పేటీఎం ప్రమోటింగ్ కంపెనీ ఒన్ 97 కమ్యూనికేషన్ షేరు లిస్టయిన రెండోరోజైన సోమవారం మరో 13 శాతం పతనంకావడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని ట్రేడర్లు చెప్పారు. ఈ కంపెనీ ఐపీవో ధర రూ.2,150కాగా, గత గురువారం లిస్టింగ్ రోజునే 27 శాతం పతనమైన సంగతి తెలిసిందే. తాజాగా మరింత తగ్గి రూ.1,360 వద్ద క్లోజయ్యింది. రెండు రోజుల్లో జరిగిన పతనంతో పేటీఎం ఇన్వెస్టర్ల సంపద రూ.55,000 కోట్లు కరిగిపోయింది. ఐపీవో ధర వద్ద ఈ కంపెనీ విలువ రూ.1.39 లక్షల కోట్లు, తాజాగా ఇది రూ.85,000 కోట్లలోపునకు క్షీణించింది.
రూ.8 లక్షల కోట్లసంపద ఆవిరి
సోమవారంనాటి మార్కెట్ భారీ పతనంతో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 8 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్కసారిగా రూ.8.21 లక్షల కోట్ల మేర తగ్గి, రూ.2,60,93, 393 కోట్లకు పడిపోయింది.
యూరప్‌లో లాక్డౌన్లు
ఐరోపా దేశాల్లో కొవిడ్ కేసులు పెరిగిన కారణంగా అక్కడ లాక్డౌన్లు విధించడం భారత్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసిందని అనలిస్టులు పేర్కొన్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారన్నారు.