టాటాల చేతికి బిస్లరి!
బిస్లరి వ్యాపారాన్ని అమ్మేస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ రమేశ్ చౌహాన్ తెలిపారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులతో చర్చలు కూడా జరుగుతున్నట్టు గురువారం ఆయన చెప్పారు
- ఇరు సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చలు
న్యూఢిల్లీ, నవంబర్ 24: బిస్లరి వ్యాపారాన్ని అమ్మేస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ రమేశ్ చౌహాన్ తెలిపారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులతో చర్చలు కూడా జరుగుతున్నట్టు గురువారం ఆయన చెప్పారు. ఈ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్‌ను దక్కించుకునేందుకు టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) సైతం పోటీపడుతున్నట్టు వివరించారు. బిస్లరి ఇంటర్నేషనల్‌ను కొనేందుకు దాని యాజమాన్యంతో సంప్రదింపుల్లో ఉన్నామని టాటా గ్రూప్ కూడా స్టాక్ ఎక్సేంజీలకు తెలియజేసింది. 1984లో బిస్లరి ఇంటర్నేషనల్‌ను జయంతీలాల్ చౌహాన్ ప్రారంభించారు. నిజానికి బిస్లరి సృష్టికర్త ఇటలీ వ్యాపారి ఫెలీస్ బిస్లరి. 1969లో ఈ బ్రాండ్‌ను జయంతీలాల్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం దేశంలో బిస్లరికి 135 ప్లాంట్లున్నాయి. 3వేల మంది పంపిణీదారులున్నారు.
డీల్ ఇంకా కుదర్లేదు
మరోవైపు బిస్లరిని టీసీపీఎల్ సొంతం చేసుకున్నదని, రూ.7,000 కోట్లతో డీల్ కూడా కుదిరిందన్న వార్తలను చౌహాన్ కొట్టిపారేశారు. అందులో ఎంతమాత్రం నిజం లేదన్నారు. బిస్లరి వ్యాపారాన్ని అమ్మేస్తున్నారా? అన్న ప్రశ్నకు చౌహాన్ బదులిస్తూ ‘అవును నిజమే అదే పనిలో ఉన్నాం’ అని పీటీఐతో అన్నారు. ఈ క్రమంలోనే టాటాలతో డీల్ కుదర్లేదని ఈ 82 ఏండ్ల వ్యాపారి స్పష్టం చేశారు. అయితే బిస్లరి కొనుగోలుకు సంబంధించి చర్చలు చేస్తున్న సంస్థల్లో టాటా గ్రూప్ ఉన్నదని వెల్లడించారు. ఇప్పటికే మార్కెట్లో హిమాలయన్, టాటా కాపర్ ప్లస్, టాటా గ్లూకో వంటి వాటర్, హైడ్రేషన్ బ్రాండ్లను టాటాలు విక్రయిస్తున్న సంగతి విదితమే.
అమ్ముతున్నది ఇందుకే..
బిస్లరి వ్యాపారాన్ని ఎందుకు అమ్మేస్తున్నారన్నదానిపై చౌహాన్ స్పందిస్తూ.. తన కూతురు జయంతి ఈ వ్యాపారాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. కాబట్టి ఎవరికో ఒకరికి ఈ వ్యాపారాన్ని అమ్మేద్దామనుకున్నానని, అందుకే ఆయా సంస్థలతో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపారు. కాగా, ‘బిస్లరి ఇంటర్నేషనల్ అమ్మకానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే ఇంతకంటే ఏమీ చెప్పలేము’ అని అంతకుముందు ఓ పత్రికా ప్రకటనలో సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు.
30 ఏండ్ల కిందటే మిగతావి..
దేశీయ శీతల పానీయాల మార్కెట్లో ప్రస్తుతం వెలుగొందుతున్న థమ్సప్, మాజా, లిమ్కాతోపాటు ఒకప్పుడు విశేష ఆదరణ పొందిన గోల్డ్ స్పాట్, సిట్రా బ్రాండ్లు చౌహాన్‌లకు చెందినవే. అయితే మూడు దశాబ్దాల కిందట 1993లో అమెరికా బేవరేజెస్ దిగ్గజం కోకా-కోలాకు అమ్మేశారు. ఇప్పుడు థమ్సప్ బిలియన్ డాలర్ బ్రాండ్‌గా రికార్డులకెక్కగా, 2024 నాటికి మాజా కూడా ఈ ఘనతను సాధిస్తుందన్న ధీమాను కోకా-కోలా వ్యక్తం చేస్తున్నది. నిజానికి 2016లో ‘బిస్లరి పీవోపీ’ పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లోకి మళ్లీ చౌహాన్ వచ్చినా.. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

