న్యూఢిల్లీ, మే 18: పెట్రో మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణకు బ్రేక్‌పడింది. ఈ సంస్థ విక్రయ ప్రక్రియలో పాలుపంచుకున్న ముగ్గురు బిడ్డర్లలో ఇద్దరు..ఇంధన ధరల విధానంపై స్పష్టత లేదంటూ వైదొలగడంతో బీపీసీఎల్ డిజిన్వెస్ట్‌మెంట్‌ను నిలుపుచేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో కేంద్ర ప్రభుత్వం తన మొత్తం 52.98 శాతాన్ని ప్రైవేటుకు విక్రయించేందుకు 2020 మార్చిలో బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ (ఈవోఐ)ను ఆహ్వానించింది. 2020 నవంబర్‌కల్లా మూడు సంస్థలు బీపీసీఎల్ కోసం బిడ్స్ సమర్పించాయి.
అయితే ఈ రేసు నుంచి ప్రస్తుతం రెండు సంస్థలు వైదొలగగా, ఒకటే మిగిలి ఉంది. ‘ విక్రయ ప్రక్రియను సింగిల్ బిడ్డర్ నిర్దేశించే పరిస్థితిలో ముందుకెళ్లడంలో అర్థం లేదు. అందుచేత ప్రస్తుతానికి ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను నిలిపివేశాం’ అని ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టంచేశారు.
బీపీసీఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఇతర వర్గాల ద్వారా తెలుస్తున్నది. ప్రభుత్వానికి ఉన్న మొత్తం 53 శాతంవాటాను అమ్మకానికి పెట్టి బిడ్స్‌ను ఆహ్వానించగా, ఇప్పుడా విక్రయ నిబంధనల్లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. యాజమాన్య నియంత్రణతో సహా 26 శాతం వాటాను ప్రైవేటుకు ఆఫర్ చేయవచ్చని, దీంతో బిడ్డర్లు బీపీసీఎల్ కొనుగోలుకు అధికంగా పెట్టుబడి చేయాల్సిన అవసరం రాదని ఆ వర్గాలు వివరించాయి.
స్టాక్ మార్కెట్లో ప్రస్తుత బీపీసీఎల్ ట్రేడింగ్ ధర ప్రకారం 53 శాతం ప్రభుత్వ వాటా విలువ రూ. 38,000 కోట్లు ఉంటుంది. దీనికి తోడు మైనారిటీ షేర్హోల్డర్లకు ఇచ్చే ఓపెన్ ఆఫర్ కోసం మరో రూ. 18,700 కోట్లు ఖర్చు చేయాలి. ప్రభుత్వం 26 శాతం వాటానే అమ్మితే బిడ్డరుకు మొత్తం పెట్టుబడి రూ.37,000 కోట్లకు మించదు.
దేశంలో రెండో పెద్ద పెట్రో మార్కెటింగ్ కంపెనీ అయిన బీపీసీఎల్ ప్రైవేటీకరణకు తొలినుంచీ పెద్దగా స్పందన లభించలేదు. అంతర్జాతీయ చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావడం, దేశీయంగా ఇంధన ధరల విధానంపై స్పష్టత లేకపోవడం ఇందుకు కారణాలని విశ్లేషకులు అంటున్నారు. దేశీ మార్కెట్లో 90 శాతం వాటా ఉన్న ప్రభుత్వ రంగ రిటైల్ సంస్థలు డీజిల్, పెట్రోల్‌ను వాటి ఉత్పత్తి వ్యయంకంటే తక్కువకు విక్రయిస్తున్నాయి.
దీంతో ప్రైవేటు రిటైలింగ్ కంపెనీలు రిలయన్స్-బీపీ, రాస్‌నెఫ్ట్, షెల్లు ఇంధనాల్ని నష్టాలకు విక్రయించడమో లేదా ధరల్ని పెంచి మార్కెట్ వాటాను కోల్పోవడమో జరుగుతున్నది. మైనింగ్ దిగ్గజం వేదాంత గ్రూప్, అమెరికాకు చెందిన వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్, ఐ స్కేర్డ్ క్యాపిటల్ అడ్వయిజర్స్..బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు బిడ్ చేశాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలంకావడంతో ఆ రెండు అమెరికా ఫండ్స్ వాటి బిడ్స్‌ను ఉపసంహరించుకున్నాయి.