న్యూఢిల్లీ, నవంబర్ 12: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్ లేదా భెల్)కు జాతీయ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) నుంచి తెలంగాణ ప్రాజెక్టు దక్కింది. 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ (టీఎస్టీపీపీ) ఏర్పాటులో ఎన్టీపీసీతో కలిసి పనిచేయబోతున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో భెల్ తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో బీహెచ్ఈఎల్ అగ్రభాగాన నిలిచి విజయం సాధించింది. కాగా, ఎన్టీపీసీతో కుదిరిన ఒప్పందం కింద ప్లాంట్ డిజైన్, ఇంజినీరింగ్, నిర్మాణ తదితర పనులను భెల్ అందిస్తుంది. ఇప్పటికే ప్రధాన ప్లాంట్ నిర్మాణం కోసం కనీస ఇంజినీరింగ్ పనుల్ని మొదలు పెట్టాలంటూ ఎన్టీపీసీ నుంచి లిమిటెడ్ నోటీస్ టు ప్రొసీడ్ (ఎల్ఎన్టీపీ)ను సైతం భెల్ అందుకున్నది. ఇదిలావుంటే 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 3 ప్లాంట్లతో ఈ రెండో దశ ప్రాజెక్టు రూపుదిద్దుకోనున్నది. మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో తొలి దశ కింద రెండు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లున్నాయి. వీటిలో ప్రస్తుతం ఉత్పత్తి కూడా జరుగుతున్నది. కాగా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం ఈ 4వేల మెగావాట్ల ప్రాజెక్టును కేటాయించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ఆవరణలో ఈ టీఎస్టీపీపీని తెస్తున్నారు. ఇటీవలే ఎన్టీపీసీ కార్పొరేట్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో రెండో దశ ప్లాంట్ నిర్మాణం కోసం రూ.29,344.85 కోట్ల అంచనా పెట్టుబడికి ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ ఏర్పాటుచేస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లలో 57 శాతం బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతోనే పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో టీఎస్టీపీపీ ప్రాజెక్టు ఇరు సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నది.