హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): వ్యాపార విస్తరణలో భాగంగా విద్యుత్తు ప్లాంట్లను నిర్మిస్తున్న సింగరేణి సంస్థ కొత్తగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్‌ను నిర్మించనుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ ప్లాంట్ సమీపంలోనే ఈ కొత్త ప్లాంట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం మంగళవారం భెల్ సంస్థతో సింగరేణి అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, భెల్‌కు ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలప్పగించింది. రూ.7,995 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ను గరిష్ఠంగా నాలుగేండ్లలో పూర్తిచేయాలని ఒప్పందం కుదుర్చుకున్నా , 40నెలల్లో పూర్తిచేయాలని సింగరేణి సీఎండీ బలరాం ఈ సందర్భంగా స్పష్టంచేశారు. వచ్చేనెల నుంచి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతమున్న 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ద్వారా సంస్థకు ఏటా రూ. 450 కోట్ల లాభాలు వస్తుండగా, కొత్తగా ఈ ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే లాభాలు మరో రూ.300 కోట్లు పెరిగే అవకాశాలున్నాయి.
బొగ్గు, క్రిటికల్ మినరల్ మైనింగ్‌లో పరస్పర సహకారం కోసం సింగరేణి సంస్థ ఎన్ఎండీసీతో కలిసి పనిచేయనున్నది. ఇందుకు సంబంధించి ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ మంగళవారం సింగరేణి సీఎండీ బలరాంతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్స్, ఇతర ఖనిజాల మైనింగ్‌లో పరస్పరం భాగస్వామ్యంకావాలని నిర్ణయించారు.