
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: భారత్ బాండ్ ఈటీఎఫ్ మూడో విడతకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. 6.2 రెట్లు అధికంగా సబ్‌స్ర్కైబ్ అయినట్లు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత బేస్ ఇష్యూ పరిమాణం రూ.1,000 కోట్లుగా ఉన్నది. దీంతో రూ.6,200 కోట్ల బిడ్లు దాఖలైనట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, గతేడాది జూలైలో రెండో విడత భారత్ బాండ్ ఈటీఎఫ్ రాగా, 3 రెట్లకుపైగా స్పందన లభించింది. నాడు దాదాపు రూ.11,000 కోట్లు వసూలయ్యాయి. ఇక 2019 డిసెంబర్లో తొలి విడతకు సుమారు రూ.12,400 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది ఓ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్. ప్రభుత్వ రంగ సంస్థల డెట్ సెక్యూరిటీల్లో ఇది పెట్టుబడులు పెడుతుంది. ప్రస్తుతం ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన బాండ్లలోనే ఈ ఈటీఎఫ్ పెట్టుబడులు పెడుతున్నది. భారత్ బాండ్ ఈటీఎఫ్‌తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు నిధుల సమీకరణ సులువుగా మారింది.