హైదరాబాద్, మార్చి 20: హైదరాబాద్ ఆధారిత ఔషధ రంగ దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. ఇక్కడి జీనోమ్ వ్యాలీలో దాదాపు రూ.650 కోట్లతో ఓ కణ, జన్యు చికిత్స (సీజీటీ) కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది వైరల్ వెక్టర్ ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా అని గురువారం సంస్థ ప్రకటించింది. అలాగే దేశంలోనే ఇది తొలి వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావడం గమనార్హం.
‘సైంటిఫిక్ సవాళ్లను ఎదుర్కోవడంలో మా ఈ సెల్, జీన్ థెరపీ ఫెసిలిటీ ఓ నూతన శకానికి నాంది పలికింది’ అని ఈ సందర్భంగా కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రధానంగా క్యాన్సర్ వంటి జెనెటిక్ వ్యాధుల చికిత్సలో ఇక మంచి ఫలితాలు రాగలవన్న ఆశాభావాన్ని వెలిబుచ్చింది. ప్రస్తుతం జన్యు, కణ చికిత్సలు పెరిగిపోయాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
తమకున్న అనుభవంతో వైద్య విధానాన్ని మరింత మెరుగుపరుస్తామన్న ఆయన వైరల్ వ్యాక్సిన్ల తయారీలో తమ ప్రతిష్ఠ ఈ సీజీటీతో మరింత పెరగగలదన్న విశ్వాసాన్ని కనబర్చారు. ఆంకాలజీ, అరుదైన వ్యాధుల చికిత్సలపై తాము దృష్టి పెట్టామని, అందులో భాగంగా తెచ్చినదే ఈ సీజీటీ అని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాచెస్ ఎల్లా అన్నారు. కాగా, ఈ కేంద్రం 50 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నది.