పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 53.32 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదని పేర్కొన్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు మమతాబెనర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ నేత కల్యాణ్ చౌబేపై దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తున్నది. పలు వార్డుల్లో అధికార తృణమూల్ రిగ్గింగ్ చేస్తున్నదని తమకు సమాచారం వచ్చిందని పేర్కొంది. ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తోసిపుచ్చింది.
మమతా బెనర్జీ సోదరుడు కార్తిక్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమ సమీప పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభిషేక్ బెనర్జీ మధ్యాహ్నం రెండు గంటల టైంలోనే ఓటేశారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు చెందిన 30 కార్ల కాన్వాయ్ ట్రాఫిక్ జామ్‌కు కారణం అవుతున్నదని తృణమూల్ ఆరోపించింది.