హైదరాబాద్, ఆగస్టు 17: దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగం అంచనాలకుమించి రాణిస్తుండటంతో అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఈ మార్కెట్‌పై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ వాహనాలను విడుదల చేయగా..తాజాగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ పలు మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాదిన్నరలోగా మూడు నుంచి నాలుగు మాడళ్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.
ప్రస్తుతం కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా మూడు నుంచి నాలుగు శాతంగా ఉండగా, వచ్చే మూడేండ్లకాలంలో ఈ వాటాను 25 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మార్కెట్లోకి జీఎల్సీ పెట్రోల్, డీజిల్ ఎస్‌యూవీని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ..భారత్‌లో ఈవీల వాడకం అంతకంతకు పెరుగుతున్నదని, నూతన కార్లు విడుదలకానుండటంతో కొనుగోలుదారులు వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. గతంలో చార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ, ఇప్పుడు కార్యాలయాలు లేదా గృహాల్లో ఉండటంతో ప్రజా మౌలిక సదుపాయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు.