ముంబై, నవంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ వరుస నష్టాల బాట పట్టినట్టే కనిపిస్తున్నది. బుధవారం కూడా సూచీలు పడిపోయాయి. దీంతో రెండోరోజూ మార్కెట్లు నిరాశపర్చినైట్టెంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 283.60 పాయింట్లు లేదా 0.44 శాతం దిగజారి 63,591.33 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 63,550.46 స్థాయికి పతనం కావడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 90.45 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 18,989.15 వద్ద స్థిరపడింది. కాగా, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీసినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎఫ్ఐఐలు రూ.1,816.91 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేటు నిర్ణయం కూడా ప్రభావితం చేస్తున్నట్టు చెప్తున్నారు.
మెటల్ 1.45 శాతం, పవర్ 1.19 శాతం, కమోడిటీస్ 1.18 శాతం, సర్వీసెస్ 1.15 శాతం, యుటిలిటీస్ 1.13 శాతం, ఐటీ 0.75 శాతం, టెక్నాలజీ 0.63 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.59 శాతం చొప్పున పడిపోయాయి. ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, మారుతీ తదితర షేర్లు నిరాశపర్చాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.35 శాతం, స్మాల్‌క్యాప్ 0.10 శాతం నష్టపోయాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా సూచీలు లాభపడగా, హాంకాంగ్ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలుండగా, అమెరికా మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి.