గరిష్ఠస్థాయిలోనే వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలు బలపడటం, చైనాలో బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాల పట్ల ఏర్పడుతున్న భయాల కారణంగా ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి ఈ ప్రభావంతో భారత్ సూచీలు వరుసగా నాలుగోవారం క్షీణించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 19,310 పాయింట్ల వద్ద ముగిసింది. కొద్ది రోజులుగా జరుగుతున్న లోయర్ టాప్, లోయర్ బాటమ్ ఫార్మేషన్ బేరిష్ ట్రెండ్‌ను సూచిస్తున్నదని ఇన్‌క్రెడ్ ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ బిస్సా చెప్పారు. అయితే కీలకమైన 50 డీఎంఏ నుంచి శుక్రవారం నిఫ్టీ బౌన్స్ అయినందున, ఈ వారం 1-2 శాతం మేర స్వల్పకాలిక పెరుగుదల ఉండవచ్చన్నారు. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో విదేశీ ఇన్వెస్టర్ల లాంగ్ పొజిషన్లకంటే షార్ట్స్ ఎక్కువగా ఉన్నందున, 50 డీఎంఏను నిఫ్టీ కోల్పోతే అమ్మకాల ఒత్తిడి తీవ్రతరమవుతుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది హెచ్చరించారు.
కీలక స్థాయి 19,265
డెయిలీ చార్టుల్లో 50 డీఎంఏ రేఖ కదులుతున్న 19,265 పాయింట్ల స్థాయి ఈ వారం నిఫ్టీకి ముఖ్యమైనదని జిమిత్ మోది తెలిపారు. ఈ స్థాయిని కోల్పోతే రానున్న రోజుల్లో 18,600 పాయింట్ల వరకూ పడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 19,646 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ వారం నిఫ్టీ 19,370-19,400 శ్రేణిని దాటితే 19,550-19,650 వరకూ పెరగవచ్చని ఏంజిల్ఒన్ చీఫ్ అనలిస్ట్ సుమీత్ చౌహాన్ అంచనా వేశారు. 19,250 వద్ద కీలక మద్దతు లభిస్తున్నదని, ఈ స్థాయిని కోల్పోతే 19,100-19,000 వరకూ తగ్గవచ్చని విశ్లేషించారు.