Credit Card | ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డు ఉంటున్నది. అలా క్రెడిట్ కార్డు వాడుతున్న వారిలో అత్యధికులు తమ నెలవారీ బిల్లులు సకాలంలో పే చేస్తుంటారు. కొందరు ముందు చూపుతో బిల్లు కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తారు. వచ్చే నెల బిల్లు చెల్లించడానికి ఇబ్బందుల్లేకుండా చూసుకుంటారు. కానీ ఇక నుంచి అలా చేయడానికి నిబంధనలు అనుమతించవు. ఇప్పటి నుంచి మీరు మీ క్రెడిట్ బిల్లు కంటే ఎక్కువ చెల్లిస్తే.. ఆ మొత్తం బ్యాంకులు మీ ఖాతాలో క్రెడిట్ చేస్తాయి.
క్రెడిట్ కార్డు యూజర్లలో అత్యధికులు నెలవారీ బిల్లు క్రమంగా తప్పకుండా చెల్లిస్తారు. కొందరు కనీస మొత్తం బిల్లు పే చేస్తారు. అలా కాకుండా మరి కొందరు బిల్లు కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారు. దీంతో హవాలా లావాదేవీలు, మోసాలు చోటు చేసుకుంటున్నట్లు బ్యాంకులు గుర్తించాయి. అందుకు ఇక నుంచి క్రెడిట్ బిల్లు కంటే ఎక్కువ మొత్తం పే చేస్తే.. ఆ మొత్తం సంబంధిత క్రెడిట్ కార్డు ఖాతాదారుడి ఖాతాలో జమ చేయాలన్న నిబంధన తెచ్చాయి. ప్రత్యేకించి విదేశాల్లో జరిపే కొనుగోళ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. సైబర్ మోసగాళ్లు అమాయకుల ఖాతాల నుంచి స్వాహా చేసిన మొత్తం క్రెడిట్ కార్డులకు తరలించి, విదేశాల్లో ట్రాన్సాక్షన్స్ కోసం వాడుతున్న ఘటనలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకున్నాయి.
ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డుపై బిల్లుల కంటే ఎక్కువ మొత్తం చెల్లించకుండా అడ్డుకుంటున్నాయి. అటువంటి బ్యాంకుల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. క్రెడిట్ కార్డు యూజర్లు బిల్లు కంటే ఎక్కువ చెల్లించకుండా తమ యాప్ల ద్వారా తమ బ్యాంక్ ఖాతాదారులను నిలువరిస్తున్నాయి. ఇతర మార్గాల్లో బిల్లు కంటే ఎక్కువ పే చేసినా, అలా చెల్లించిన అదనపు మొత్తం.. నిర్దిష్ట గడువు లోపు తమ ఖాతాదారులకు చెల్లిస్తాయి.