న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,837 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,579 కోట్ల లాభంతో పోలిస్తే 5.6 శాతం వృద్ధి కనబరిచినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ రూ.34,676 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.31,416 కోట్లతో పోలిస్తే 10 శాతం వరకు పెరిగింది.
దీంట్లో వడ్డీల ద్వారానే రూ.30,908 కోట్ల ఆదాయం సమకూరింది. గత త్రైమాసికంలో బ్యాంక్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.7,015 కోట్ల నుంచి రూ.7,664 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.08 శాతం నుంచి 2.43 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.7 శాతం నుంచి 0.59 శాతానికి దిగొచ్చింది. అయినప్పటికీ మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ గత త్రైమాసికంలోనూ రూ.1,082 కోట్ల నిధులు వెచ్చించింది.