Bank of Baroda | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ముందుకు వచ్చింది. బీవోబీ పండుగ క్యాంపెయిన్ (BOB Festival Campaign)లో భాగంగా బీవోబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ (BOB Lite Savings Account) అనే పేరుతో జీవిత కాలం జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించింది. ఈ ఖాతాలో కనీస నిల్వల్లేకుండానే బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చునని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ అకౌంట్‌తోపాటు ఖాతాదారులు ఫ్రీ ‘రూపే ప్లాటినం’ డెబిట్ కార్డు పొందవచ్చు. అయితే, మూడు నెలల్లో కనీస మొత్తం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అర్హతలను బట్టి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా జారీ చేస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా.
పండుగల సీజన్ నేపథ్యంలో పలు బ్రాండ్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలకు అనుగుణంగా ఆయా బ్రాండ్ల కొనుగోళ్లపై వచ్చే డిసెంబర్ నెలాఖరు వరకూ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మైంత్రా, స్విగ్గీ, జొమాటోల్లో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది.
పదేండ్ల వయస్సు దాటిన భారతీయ పౌరులెవరైనా బ్యాంక్ ఆఫ్ బరోడా లైట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ ఖాతా ప్రారంభించిన వారికి ఫ్రీ రూపే ప్లాటినం డెబిట్ కార్డు జారీ చేస్తుంది. ప్రతి త్రైమాసిక కాలంలో మెట్రోపాలిటన్ నగరాలు, పట్టణాల్లో రూ.3000, సెమీ అర్బన్ నగరాల్లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 కనీస నిల్వ నిర్వహించాలి. ఖాతా నిర్వహణ అర్హతలను బట్టి లైఫ్-టీం ఫ్రీ క్రెడిట్ కార్డు జారీ చేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 30 చెక్కు లీవ్స్ బుక్ ఫ్రీగా పొందొచ్చు.