Bajaj CNG motorcycle | ఇప్పుడు క్లీన్ ఎనర్జీ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. తొలుత కార్లు, ఆటోల్లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు వాడుతూ వచ్చారు. సీఎన్జీ వేరియంట్లను ఆవిష్కరిస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. తాజాగా బజాజ్ ఆటో ద్విచక్ర వాహన సెగ్మెంట్ లో.. మోటారు సైకిల్ విభాగంలో సీఎన్జీ బైక్ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బజాజ్ సీఎన్జీ మోటారు సైకిల్ ఈ నెల 18న మార్కెట్లో ఆవిష్కరించాల్సి ఉంది.
కానీ, వచ్చేనెల 17న సీఎన్జీ వేరియంట్ మోటారు సైకిల్ ఆవిష్కరిస్తామని బజాజ్ పల్సర్ ఎన్ఎస్400 జడ్ బైక్ ఆవిష్కరణ సందర్భంగా బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ప్రకటించారు. తాజాగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ మాత్రం.. తమ సీఎన్జీ మోటారు బైక్ ఆవిష్కరణ కొన్ని వారాలు ఆలస్యం అవుతుందని తెలిపారు. తొలుత సీఎన్జీ బైక్ పేరు ‘బ్రూజర్’ అని చెప్పినా.. పూర్తిగా భిన్నమైన పేరుతో వస్తుందని రాకేశ్ శర్మ ధృవీకరించారు.
దేశీయ ద్విచక్ర వాహనాల విభాగంలోకి దూసుకొస్తున్న తొలి సీఎన్జీ బజాజ్ మోటారు సైకిల్.. 100-150సీసీ ఇంజిన్ మోటారు సైకిళ్ల మధ్య శ్రేణితో వస్తుందని భావిస్తున్నారు. 125సీసీ ఈక్వలెంట్ – పెట్రోల్ అండ్ సీఎన్జీ ఫ్యుయల్ ఆప్షన్లలో బజాజ్ తాజా బైక్ వస్తోంది. దీనికి పెట్రోల్ ఫ్యుయల్ ట్యాంక్, సీఎన్జీ ఫ్యుయల్ ట్యాంకు వేర్వేరుగా ఉంటాయి. ఇది ద్విచక్ర వాహనాల రంగంలో గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. సంప్రదాయ పెట్రోల్ వినియోగ మోటారు సైకిళ్లతో పోలిస్తే సీఎన్జీ బైక్స్ నిర్వహణ ఖర్చు 50 శాతం తగ్గుతుందని తెలుస్తోంది. హీరో మోటో కార్ప్, టీవీఎస్, హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థల టూ వీలర్లకు గట్టి పోటీ ఇవ్వనున్నదీ సీఎన్జీ బజాజ్ బైక్.