Bajaj CNG Bike | బజాజ్ ఆటో సరిగ్గా 25 ఏండ్ల క్రితం సీఎన్జీ పవర్డ్ ఆటోరిక్షాను ఆవిష్కరించింది. తద్వారా ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులకు మార్గం సుగమం చేసింది. ఇప్పుడు కార్లు, ఫ్లీట్, షేర్డ్ మొబిలిటీ స్పేస్‌లో సీఎన్జీ వాహనాలకు ప్రాధాన్యం పెరిగింది. తాజాగా భారత మొబిలిటీ రంగంలో మరోమారు విప్లవాత్మక మార్పుకు బజాజ్ ఆటో రంగం సిద్ధం చేసింది. ఎంతోకాలంగా సీఎన్జీ మోటారు సైకిల్ అభివృద్ధి చేస్తున్నది బజాజ్ ఆటో. గత ఏడాది కాలంగా ప్రయోగాత్మకంగా బజాజ్ సీఎన్జీ మోటారు సైకిల్ టెస్టింగ్ తర్వాత మార్కెట్లో ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చేనెల ఐదో తేదీన ప్రపంచంలోనే తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరిస్తామని బజాజ్ ఆటో ధృవీకరించింది.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో పుణెలో బజాజ్ సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరిస్తారు. చకాన్ బేస్డ్ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో.. సదరు సీఎన్జీ మోటారు సైకిల్‌కు ‘బ్రజర్’ అని పేరు పెట్టారు. దశాబ్ద కాలంగా సుస్థిర ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ వాడకానికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకంలో భాగంగా సీఎన్జీ మోటారు బైక్ ‘బ్రజర్’ ఆవిష్కరిస్తోంది బజాజ్.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 పలుకుతోంది. మరోవైపు సామూహిక ఎలక్ట్రిక్ వాహనాల దిశగా అడుగులేయడానికి సుదీర్ఘ కాలం పట్టే అవకాశాలు ఉన్న వేళ.. టూ వీలర్స్‌కు పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ‘సీఎన్జీ మోటార్ బైక్. ఆ దిశగా బజాజ్ ఆటో తొలుత చొరవ ప్రదర్శిస్తోంది.
‘స్లోపర్ ఇంజిన్’ పవర్డ్, డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ బేస్‌గా బజాజ్ సీఎన్జీ మోటారు సైకిల్ ఉంటుంది. 110-150సీసీ ఇంజిన్ మాదిరిగా పని చేస్తుందని భావిస్తున్నారు. పెట్రోల్ అండ్ సీఎన్జీ ఫ్యుయల్‌తో నిరంతరాయంగా, స్మూత్‌గా ప్రయాణం చేయడానికి వీలుగా కొత్త సీఎన్జీ మోటారు సైకిల్ 125సీసీ ఇంజిన్ తో వస్తుందని భావిస్తున్నారు. సీఎన్జీ మోటారు సైకిల్ వినియోగంతో ఫ్యుయల్ కాస్ట్ 50-65 శాతం తగ్గుతుందని బజాజ్ ఆటో చెబుతోంది.