First Hyper Car Azani | కార్ల మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్‌కు పెట్టింది పేరు.. సూపర్ కార్ల నిర్మాణం జోలికెళ్లలేదు. కాని కొన్ని భారత్ స్టార్టప్ సంస్థలు ఆ అభిప్రాయాన్ని తిరగరాయాలని భావిస్తున్నాయి. బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్.. మీన్ మెటల్ మోటార్స్ (ఎంఎంఎం) అధికారికంగా ప్రొటోటైఫ్ హైపర్ కారు అజానీని ఆవిష్కరించింది. ఈ కారు 354 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని అంచనా. అదే జరిగితే శరవేగంగా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ హైపర్ కారు కూడా ఇదే కానుంది. దీని ధర కూడా కాస్త కాస్ట్లీ. సుమారు రూ.89 లక్షలు (1.20 లక్షల డాలర్లు)గా నిర్ణయించాలని ఎంఎంఎం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఎం-జీరో కాన్సెప్ట్‌తో తయారైన ఈ కారు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్ కారు. మిడ్ ఇంజిన్ టూ డోర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్డ్ మార్పింగ్ సీట్స్, అడ్వాన్స్డ్ టెలిమ్యాటిక్స్, టార్చ్ వెక్టరింగ్, ఎం-లాగ్ ఇంటిగ్రేషన్, ఆగుమెంటెడ్ రియాల్టీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
అజానీ హైపర్ కారులో అమర్చే ఎలక్ట్రిక్ మోటార్ 1000 హెచ్‌పీ, 1000 ఎన్ఎం టార్చి విడుదల చేసే సామర్థ్యం సంతరించుకుంటుంది. 120 కిలోవాట్ల కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ నుంచి ఇంధనం ఉత్పత్తి అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే గరిష్ఠంగా 530 కి.మీ. దూరం ప్రయాణించగల సత్తా దీని సొంతం. కేవలం 2.1 సెకన్లలో 60 మైళ్లు (97 కిలోమీటర్ల) స్పీడ్‌తో దూసుకెళ్తుందీ హైపర్ కారు. వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో విపణిలోకి వస్తుందని భావిస్తున్నారు.