హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా కాకుండా ‘గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్’గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్లోని ‘ఆజాద్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్’లో బేకర్ హ్యూస్ కోసం ప్రత్యేకంగా 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తయారీ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తయారీ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బేకర్ హ్యూస్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని చెప్పారు. ఒకప్పుడు రక్షణ పరిశోధనా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే నిలయమైన హైదరాబాద్.. నేడు ప్రైవేట్ రంగంలోనూ ప్రెసిషన్ ఇంజినీరింగ్ పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిందన్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో.. జాతీయ భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఆ దిశగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసి.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ‘అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ ‘బేకర్ హ్యూస్’.. ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్(వోఎఫ్ఎస్ఈ), ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ టెక్నాలజీ(ఐఈటీ), టెక్నాలజీ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యూనిట్‌తో కొత్తగా 230 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.