Citi to Axis Bank | సిటీ గ్రూప్ ఇంక్ ఇండియా రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్‌ను సొంతం చేసుకునే దిశగా ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు ముందుకెళుతున్నది. రెండు బ్యాంకుల మధ్య డీల్ విలువ 250 కోట్ల డాలర్లు అని దీంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. వచ్చే కొన్ని వారాల్లో యాక్సిస్ బ్యాంకులో సిటీ బ్యాంక్ ఇండియా రిటైల్ బిజినెస్ విలీనంపై అగ్రిమెంట్‌కు వస్తారని సమాచారం. రెండు బ్యాంకుల మధ్య డీల్‌కు ఆర్బీఐ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ డీల్‌లో నగదు చెల్లింపులు 200 కోట్ల డాలర్ల లోపే ఉంటాయని తెలుస్తున్నది. యాక్సిస్ బ్యాంకులో సిటీ బ్యాంకు కార్యకలాపాలు మమేకం కావడానికి ఆరు నెలలు పడుతుందని సమాచారం.
ప్రస్తుత సిటీ బ్యాంక్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పోటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న యాక్సిస్ బ్యాంక్.. తన ప్రత్యర్థులపై పైచేయి సాధించిందని వార్తలొచ్చాయి. చర్చలు అడ్వాన్స్ దశలో ఉన్నాయని, ఒప్పందం ఒకింత జాప్యం అయ్యే అవకాశం ఉందని వినికిడి. దీనిపై స్పందించడానికి యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ అధికారులు నిరాకరించారు.
భారత్‌తోపాటు ఆసియా, యూరప్ ఖండాల్లోని 13 దేశాల్లో తమ రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను మూసేయాలని సిటీ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) జాన్ ఫ్రాసెర్ ఇంతకుముందు నిర్ణయించారు. వెల్త్ మేనేజ్మెంట్ వంటి హై గ్రోత్ బిజినెస్‌లపై దృష్టి కేంద్రీకరించారు.