న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: రేట్ల పెంపునకు రిజర్వ్‌బ్యాంక్ వెనుకాడినా, వాణిజ్య బ్యాంక్‌లు మాత్రం వరుసగా వడ్డింపులు మొదలు పెట్టేశాయి. గృహ, ఆటో, ఇతర రుణ రేట్ల పెంపునకు కారణమయ్యే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంఎసీఎల్ఆర్)ను దేశీ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచిన వెనువెంటనే ప్రైవేట్ బ్యాంక్‌లైన కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు రుణ రేట్లను అధికం చేశాయి. ఈ రెండు ప్రైవేట్ బ్యాంక్‌లు వాటి ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్ల (0.05 శాతం) మేర పెంచాయి. ఇప్పటికే ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) పెంచిన సంగతి తెలిసిందే. మరో పీఎస్‌యూ బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు గత వారాంతంలో ప్రకటించింది. రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య సమీక్షలో కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా అట్టిపెట్టిన కొద్ది రోజులకే ఈ బ్యాంకులు ఎంసీఎల్ఆర్ పెంచడం గమనార్హం.
అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
తాజాగా కొటక్ బ్యాంక్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం ప్రకారం అన్ని కాలపరిమితులకూ పెంచిన ఎంసీఎల్ఆర్ ఏప్రిల్ 16 నుంచి అమలులోకి వచ్చింది. ఈ బ్యాంక్ ఓవర్‌నైట్ రేటు 6.60 శాతం నుంచి 6.65 శాతానికి పెంచగా, నెల, 3 నెలలు, 6 నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 6.90 శాతం, 6.95 శాతం, 7.25 శాతానికి చేరాయి. అలాగే 1,2,3 సంవత్సరాల పరిమితులుగల రుణ రేటు 7.40 శాతం, 7.70 శాతం, 7.90 శాతానికి పెరిగింది. ఇక యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం కాలపరిమితులన్నింటి రుణ రేట్లు 5 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగాయి. పెరిగిన యాక్సిస్ ఎంసీఎల్ఆర్ ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ బ్యాంక్ కొత్త ఓవర్‌నైట్ రేటు 7.15 శాతానికి పెరగ్గా, 1 నెల, 2 నెలలు, 3 నెలల రేట్లు వరుసగా 7.15 శాతం, 7.25 శాతం, 7.30 శాతంగా ఉన్నాయి. ఏడాది రేటు 7.35 శాతానికి, రెండేండ్లది 7.45 శాతం, మూడేండ్లది 7.50 శాతానికి చేరింది.
ఎంసీఎల్ఆర్ అంటే..
ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అనేది ఆయా బ్యాంక్‌ల బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అంతకంటే తక్కువ రేటుపై రుణాల్ని కస్టమర్లకు ఇవ్వరాదు. అలాగే ఏ రుణాలకైనా అదే కనిష్ఠ వడ్డీ రేటుగా ఉంటుంది.