Jet Airways New CEO | దాదాపు మూడేండ్లుగా నేలకు పరిమితమైన ప్రముఖ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్వేస్ నూతన సీఈవోగా సంజీవ్ కపూర్ నియమితులయ్యారు. ఈ సంస్థకు కల్రాక్ జలాన్ సారధ్యంలోని కన్సార్టియం టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నాలుగో తేదీన సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారని కల్రాక్ జలాన్ కన్సార్టియం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రెసిడెంట్‌గా సంజీవ్ కపూర్ పని చేస్తున్నారు. అంతకుముందు టాటా సన్స్ అనుబంధ విస్టారా ఎయిర్‌లైన్స్ చీఫ్ స్ట్రాటర్జిక్ అండ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పని చేశారు. తద్వారా విస్తారా, మార్కెటింగ్, నెట్వర్క్ ప్లానింగ్, ఇతర కార్యకలాపాలను పర్యవేక్షించారు.
2014-15లో స్పైస్‌జెట్ సీవోవోగా ఇన్నోవేటివ్ ప్రైసింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటర్జీలను అమలు చేశారు. అధిక ఇంధన ధరల నేపథ్యంలో స్పైస్‌జెట్ నగదు కొరతను ఎదుర్కొన్నది. దీంతో సంస్థ యాజమాన్యం మారడానికి దారి తీసింది. ఈ పరిస్థితుల్లో సంజీవ్ కపూర్ 2016లో స్పైస్‌జెట్ నుంచి బయటకువచ్చారు. గత నెలలో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఈవో విపుల్ గుణతిలకను చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా జల్రాక్ కలాన్ కన్సార్టియం నియమించింది.