న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆటోమొబైల్ సంస్థలకు జూలై అచ్చొచ్చింది. గత నెలలో వార్షిక వృద్ధిరేటు 10 శాతంగా నమోదైంది. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర, కమర్షియల్ వాహనాలకు కొనుగోలుదారుల నుంచి లభించిన మద్దతుతో జూలై నెలలో వాహన విక్రయాలు రెండంకెల వృద్ధి నమోదైనట్లు ఇండస్ట్రీ బాడీ ఫాడా తెలిపింది. గత నెలలో మొత్తంగా 17,70,181 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలై 2022లో 16,08,217 యూనిట్లు జరిగాయి. వీటిలో ప్యాసింజర్ వాహన సేల్స్ 4 శాతం పెరిగి 2,84,064 యూనిట్లకు చేరుకున్నాయి. ఉత్తర భారతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ నూతన ఉత్పత్తులను విడుదల చేయడం అమ్మకాలకు కలిసొచ్చిందని ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు.