Luxxur Cars in India | రెగ్యులేటరీ నిబంధనలు, అధిక పన్నుల వల్లే భారత్‌లో లగ్జరీ కార్ల మార్కెట్‌కు అవరోధంగా నిలిచాయని ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా పేర్కొంది. అయితే, దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ పుంజుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. భారత్ మార్కెట్‌పై తాము పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నామని ఆడీ డైరెక్టర్ అలెగ్జాండర్ వోన్ అన్నారు. దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల విక్రయాలు రెండు శాతం లోపేనని, గత పదేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నదన్నారు.
బ్రిక్స్ సభ్య దేశాల్లో భారత్ ఒకటి. చైనాలో లగ్జరీ కార్ల విక్రయాలు ఎక్కువగా సాగుతుండగా, తర్వాతీ స్థానంలో భారత్ నిలుస్తుందని భావించామని అలెగ్జాండర్ వోన్ చెప్పారు. భారత్‌లో సంపన్నులు అనేకమంది ఉన్నా, అధిక పన్నులు విధించడం వల్లే లగ్జరీ కార్ల మార్కెట్ పుంజుకోవడం లేదని పేర్కొన్నారు. కానీ, సమీప భవిష్యత్‌లో విలాసవంతమైన కార్లకు గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం లగ్జరీ కార్లపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. సెడాన్ కార్లపై అదనంగా 20 శాతం, ఎస్‌యూవీలపై 22 శాతం సెస్ విధిస్తున్నారు. దీని ప్రకారం లగ్జరీ కార్లపై మొత్తంగా 50 శాతం పన్ను వసూలు చేస్తున్నది కేంద్రం. ఇక రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చార్జీలు మారిపోతుంటాయి. ఫలితంగా లగ్జరీ కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు లగ్జరీ కార్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదన్నారు ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్.