న్యూఢిల్లీ, నవంబర్ 28: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ క్యూ7 సరికొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.88.66 లక్షలు మొదలుకొని రూ.97.81 లక్షల గరిష్ఠ స్థాయిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 3.0 లీటర్ల వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్తో తయారైన ఈ మాడల్లో 8-స్పీడ్ గేర్బాక్స్, కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
ఈ సందర్భంగా ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది లగ్జరీ కార్ల ఇండస్ట్రీ 8-10 శాతం వృద్ధిని నమోదు చేసుకోనుండగా, సంస్థ కూడా ఇంతే స్థాయిలో వృద్ధిని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో ఇండస్ట్రీ 5 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఈ ఏడాది 50 వేల యూనిట్లకు చేరుకుంటున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.