హైదరాబాద్, నవంబర్ 7: ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్పిరిన్ ఉత్పాదక కేంద్రం అమెరికా ఎఫ్‌డీఏ పరిశీలనలో పాసైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరాయపురంలోగల ఆస్పిరిన్ ఔషధ తయారీ ప్లాంట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇద్దరు యూఎస్ఎఫ్డీఏ అధికారులు సందర్శించి తనిఖీలు చేపట్టారు.
కాగా, అన్ని నిబంధనలకు లోబడే ఈ ప్లాంట్ నడుస్తున్నట్టు సర్టిఫికెట్ ఇచ్చారని తాజాగా కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఏ రకమైన ఫామ్ 483 అబ్జర్వేషన్లు జారీ చేయలేదని స్పష్టం చేసింది. 1947లో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం చక్కెరతోపాటు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ రసాయనాలు, ఎరువులు, ఆస్పిరిన్, సలిక్లిక్ యాసిడ్, పవర్ తదితర ఉత్పత్తుల్లోకి విస్తరించింది. తణుకు, కొవ్వూరు, గుంటూరు, తాడువాయి, సగ్గొండ, భీమడోలులో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు సంస్థకున్నాయి.