Nirmala on Bank’s Vacancies | 12 కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాల్లో ఇవి ఐదు శాతం. అత్యధికంగా ఎస్బీఐలో 8,544 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీ నాటికి 8,05,896 ఉద్యోగాల్లో 41,177 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఆఫీసర్ స్థాయి నుంచి క్లర్క్, సబ్స్టాప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్బీఐలో 3,424 ఆఫీసర్ పోస్టులు, 5,121 క్లరికల్ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి
ఎస్బీఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో 6,743 పోస్టులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 5,112, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,848 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో సభ్యుల ప్రశ్నలకు రాతపూర్వక సమాధానంగా చెప్పారు. భారీగా ఉద్యోగ ఖాళీలు ఉండటంతో బ్యాంకులు విధులు నిర్వర్తించలేకపోతున్నాయా? అంటే అదేమీ లేదన్నారు.
ఉద్యోగులు రిటైర్ కావడంతోపాటు ఇతర కారణాల వల్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. 2016లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఒక పోస్ట్ మినహా గత ఆరేండ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక పోస్ట్ గానీ, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గానీ రద్దు చేయలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడుతున్నాయన్నారు.