Foldable I-Phone | స్మార్ట్‌ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ స్క్రీన్ ఎక్కడ పగులుతుందో అని కేర్ తీసుకుంటారు. ఇంట్లో చిన్న పిల్లలుంటే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అలాంటి టెన్షన్ ఏం అవసరం లేదంటోంది ఆపిల్. ఎంత ఎత్తు నుంచి ఫోన్ కిందపడినా స్క్రీన్కు ఎలాంటి డ్యామేజీ జరగకుండా ఉండేలా సరికొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇప్పటికే శాంసంగ్, ఒప్పో, మోటరోలా తదితర కంపెనీలన్నీ మార్కెట్లోకి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చాయి. ఈ బాటలోనే ఆపిల్ ఐ-ఫోన్ కూడా వచ్చేస్తున్నది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసేందుకు అవసరమైన టెక్నాలజీ డిజైన్ చేయడంతోపాటు దానిపై పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నది. 2025లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.. పూర్తిగా ప్రొటెక్షన్ ఫీచర్లతో యూజర్లకు అందుబాటులోకి తేవడానికి ఆపిల్ కృషి చేస్తున్నది.
నూతన టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఐ-ఫోన్, ఐపాడ్ మోడల్స్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్లతో తేవాలని ఆపిల్ సంకల్పం.. అవి భారీ ఎత్తుపై నుంచి కింద పడినా దెబ్బ తినకుండా డిజైన్ చేసినట్లు తెలుస్తున్నది. భారీ ఎత్తు నుంచి కింద పడ్డా సదరు ఫోల్డబుల్ ఫోన్ ఫోల్డప్ అయ్యేలా.. డ్యామేజీ కనిష్ట స్థాయికి తేవాలని యోచిస్తున్నది. అందుకోసం ఫోల్డింగ్ డిస్ప్లే యాంగిల్ 180 డిగ్రీల కంటే తక్కువగా ఉండేలా డిజైన్ చేసినట్లు ఆపిల్ పేటెంట్ అప్లికేషన్ చెబుతున్నది.
అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ (యూఎస్‌పీటీవో)కు ఆపిల్ పెట్టుకున్న పేటెంట్ కోసం చేసిన దరఖాస్తు టైటిల్ ‘సెల్ఫ్ రీట్రాకింగ్ డిస్ప్లే డివైజ్ అండ్ టెక్నిక్యూస్ ఫర్ ప్రొటెక్టింగ్ స్క్రీన్ యూజింగ్ డ్రాప్ డిటెక్షన్’ అని ఉంది. భారీ ఎత్తు నుంచి కింద పడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మోటరైజ్డ్ ఫోల్డింగ్ డివైజ్ మెకానిజం.. పాక్షికంగా గానీ, పూర్తిగా ఫోల్డింగ్ క్లోజ్ అవుతుందన్నమాట.
ఆల్ట్రా థిన్ గ్లాస్‌తో ఫోల్డబుల్ డిస్ప్లే, రోలబుల్ డిస్ప్లేలను తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. డివైజ్ క్లోజ్ కావడంతోపాటు డిస్ప్లే రక్షించుకోవడం ద్వారా నష్టం తగ్గించుకోవడమే ఈ ఆపిల్ ఐఫోన్ లక్ష్యంగా కనిపిస్తున్నది. ‘ఒకవేళ మొబైల్ ఫోన్ కింద పడుతుందని సెన్సార్ డిటెక్ట్ చేస్తే సదరు ఫోల్డబుల్ డివైజ్ తనకు తాను పాక్షికంగా రీట్రాక్ అయి గ్రౌండ్ స్ట్రైకింగ్ నుంచి డిస్ప్లే దెబ్బతినుకుండా ప్రొటెక్షన్ కల్పిస్తుంది’ అని ఆపిల్ తన పేటెంట్ అప్లికేషన్లో పేర్కొంది. కానీ, ఫోల్డబుల్ డిస్ప్లేతో ఐ-ఫోన్, ఐపాడ్ తెచ్చే అంశంపై గానీ, ఈ ఫోన్ పేటెంట్‌కు సంబంధించిన సమాచారం గానీ ఆపిల్ బయటపెట్టలేదు.