న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశవ్యాప్తంగా ఐఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు స్టోర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది యాపిల్ సంస్థ. పుణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో కొత్త స్టోర్లను నెలకొల్పనున్నట్లు యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డియర్డ్రి ఓబ్రియాన్ తెలిపారు. దీంతోపాటు దేశీయంగా తయారైన ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ సిరీస్ ఫోన్లను ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. 2023లో సంస్థ ఢిల్లీ, ముంబైలలో ఒక్కో స్టోర్‌ను ప్రారంభించింది.
సైయెంట్ డీఎల్ఎం చేతికి అమెరికా సంస్థ
హైదరాబాద్, అక్టోబర్ 4: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సైయెంట్ డీఎల్ఎం..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు అల్టెక్ ఎలక్ట్రానిక్సను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ 29 మిలియన్ డాలర్లు(రూ.250 కోట్లకు పైమాటే). 2023లో అల్టెక్ ఎలక్ట్రానిక్స్ 37.2 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఈ కొనుగోలు జరిపినట్లు, ముఖ్యంగా క్లయింట్లకు నూతన సేవలు అందించడానికి వీలు పడనున్నదని పేర్కొంది. ఈ కొనుగోలు పూర్తైన తర్వాత సంస్థ పరిధిలోకి కొత్తగా 80 వేలచదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన తయారీ ప్లాంట్ చేరనున్నది.