Apple to Support UNICEF | రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. యుద్ధంతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్లను ఆదుకునేందుకు ఐరాస అనుబంధ యునిసెఫ్ ముందుకు వచ్చింది. యునిసెఫ్‌కు మద్దతుగా టెక్ దిగ్గజం ఆపిల్ విరాళాల సేకరణ చేపట్టింది. అందుకోసం తన వెబ్సైట్, యాప్‌ల్లో బ్యానర్లు, నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఆపిల్ తన యూజర్లు మాక్స్, ఐఫోన్స్ ద్వారా విరాళాలు పంపాలని అభ్యర్థిస్తున్నది.
రెండు రోజుల క్రితం ఆపిల్ తన ప్లాట్‌ఫామ్స్ మీదుగా ప్రత్యక్షంగా యునిసెఫ్‌కు విరాళాల సేకరణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో సంక్షోభం బాధిత కుటుంబాలకు మద్దతుగా విరాళాలు ఇవ్వండి అంటూ ఆపిల్ వెబ్సైట్లో బ్యానర్ ప్రత్యక్షమైంది. ఇటువంటి వార్తలే ఆపిల్ న్యూస్‌లోనూ కనిపించాయి. యునిసెఫ్ భాగస్వామ్యంతో ఉక్రెయిన్ బాధితులకు విరాళాల సేకరణను ప్రారంభించింది.
యాప్ స్టోర్‌లో బ్రౌజ్ సెక్షన్ ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ యాప్‌ల్లోనూ ఇటువంటి యాడ్సే కనిపించాయి. ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లోని ఐ-ట్యూన్స్ స్టోర్‌లో ఇటువంటి బ్యానర్ పోస్ట్ చేసింది ఆపిల్. ఆపిల్ మ్యూజిక్‌లో మ్యాక్ బ్యానర్ ఆవిష్కృతమవుతుంది. స్థానిక కరెన్సీలోనే విరాళాలు ఇవ్వాలని దాతలను కోరుతున్నది.