Intel | క్యాలిఫోర్నియా, నవంబర్ 2: ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో భారీ డీల్‌కు సంకేతాలొస్తున్నాయి. ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ చేతికి.. చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ రాబోతున్నదన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అయితే ఈ రేసులో ఈ రెండు క్యాలిఫోర్నియా ఆధారిత కంపెనీల నడుమ దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్సంగ్ కూడా వస్తున్నట్టు చెప్తున్నారు. ఇంటెల్‌ను హస్తగతం చేసుకొనేందుకు యాపిల్‌తోపాటు సామ్సంగ్ సైతం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
చిప్ తయారీలో ప్రపంచాన్ని శాసించిన ఇంటెల్.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నది. అయితే ఈ సమయంలోనే ఈ టేకోవర్ వార్తలు వస్తుండటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఒకప్పటితో పోల్చితే మార్కెట్లో నేడు ఇంటెల్‌కు గట్టి పోటీనే ఎదురవుతున్నది. దీంతో లాభాలు అంతకంతకూ పడిపోతున్నాయి. సామ్సంగ్, క్వాల్కామ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, టాటా ఎల్క్సీ, ఎన్విదియా, బ్రాడ్‌కామ్ తదితర కంపెనీలు చిప్ తయారీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక సంప్రదాయ చిప్‌లతో పోల్చితే కృత్రిమ మేధస్సు (ఏఐ) చిప్స్ అభివృద్ధిలో వెనుకబడటం కూడా ఇంటెల్‌కు కొంత ప్రతికూలంగా మారింది.
ప్రస్తుతం ఇంటెల్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లలోపే. 2021 ఫిబ్రవరిలో సంస్థ సీఈవోగా ప్యాట్ గ్లెసింగర్ బాధ్యతలు తీసుకున్న దగ్గర్నుంచి ఇంటెల్ షేర్ విలువ 60 శాతం పడిపోవడం గమనార్హం. ఇక వేతన భారం తగ్గించుకొనేందుకు ఈ ఏడాది 17వేల మందికిపైగా ఉద్యోగులను సంస్థ తొలగించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. గత నెల 31న ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇంటెల్ నష్టం 16.6 బిలియన్ డాలర్లు. 56 ఏండ్ల కంపెనీ చరిత్రలో ఇంత నష్టం ఎప్పుడూ వాటిల్లలేదు. ప్రస్తుత ఏఐ బూమ్‌ను ఇంటెల్ అందిపుచ్చుకోకపోవడం కూడా దెబ్బతీసింది. ఎన్విదియా ఇప్పుడు ఏఐ చిప్ తయారీలో రారాజు. ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా కూడా ఉన్నది. కానీ ఒకప్పుడు సెమీకండక్టర్ సూపర్‌పవర్‌గా ఉన్న ఇంటెల్ మాత్రం కళావిహీనంగా మారిపోతున్నది. ఆధునిక టెక్నాలజీలను అందుకోలేక, సంప్రదాయ చిప్ తయారీకి డిమాండ్ లేక నష్టపోతున్నది.
2019లో ఇంటెల్ మోడెమ్ విభాగాన్ని యాపిల్ సొంతం చేసుకున్నది. అయితే కేవలం ఇంటెల్‌కు చెందిన మోడెమ్ డివిజన్‌ను మాత్రమే కాదు.. మొత్తంగా ఇంటెల్నే యాపిల్ చేజిక్కించుకున్నదన్న వదంతులూ వస్తుండటం గమనార్హం. అయితే ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని చెప్తున్నవారూ ఉన్నారు. యాపిల్ శక్తివంతమైన మ్యాక్ ల్యాప్‌టాప్‌లకు ఇంటెల్ చిప్‌లనే వాడేవారు. అయితే 2020 నుంచి యాపిల్ తమ సొంత సిలికాన్ చిప్‌లను వినియోగిస్తున్నది. దీంతో ఇంటెల్ మొత్తాన్ని యాపిల్ కొనలేదని అంటున్నారు. సిలికాన్ చిప్స్.. ఏఆర్ఎం ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేస్తాయి. ఐఫోన్, ఐపాడ్, యాపిల్ టీవీ, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌ట్యాగ్, హోమ్‌పాడ్, యాపిల్ విజన్ ప్రో తదితర ఉత్పత్తులన్నింటిలోనూ సిలికాన్ చిప్స్‌నే వాడుతున్నారు.