న్యూయార్క్ : కరోనా మహమ్మారితో రెండేండ్లుగా ఇంటి నుంచి పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తిరిగి కార్యాలయాల బాట పడుతున్నారు. వర్క్ ఫ్రం హోం వెసులుబాటుకు అలవాటు పడిన టెకీలు తిరిగి ఆఫీసులకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఇంటి నుంచి ఆఫీసులకు వెళ్లేందుకు ఎక్కువ సమయం ప్రయాణాలకు సరిపోతుందని, ఉత్పాదకత పడిపోతుందని మరికొందరు భావిస్తున్నారు. తిరిగి ఆఫీసుకు రావాలని కంపెనీల నుంచి పిలుపు వస్తుంటే పలువురు ఏకంగా ఉద్యోగాలకు రాజీనామా చేసి వెసులుబాటు కల్పించే ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఇదే తరహాలో ఆఫీసుకు రావాలని కంపెనీ కోరడంతో యాపిల్ మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్ ఇయాన్ గుడ్ఫెలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కంపెనీని వీడుతున్నట్టు ఇయాన్ తన టీం సభ్యులకు సమాచారం అందించాడు. పని విషయంలో మరింత వెసులుబాటు తన టీంకు మెరుగైన పాలసీ అంటూ సిబ్బందికి రాసిన నోట్లో ఇయాన్ స్పష్టం చేశారు. కంపెనీ నుంచి వైదొలగాలనే ఇయాన్ నిర్ణయం యాపిల్ హైబ్రిడ్ వర్క్ పాలసీపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ఏప్రిల్ 11 నుంచి ఉద్యోగులు వారానికి కనీసం ఒకరోజైనా ఆఫీస్ నుంచి పనిచేయాలని యాపిల్ న్యూ వర్క్ పాలసీని ముందుకుతీసుకువచ్చింది. మే 2 నాటికి వారానికి రెండు రోజులు, మే 23 నాటికి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఉద్యోగులకు యాపిల్ స్పష్టం చేసింది. యాపిల్ న్యూ పాలసీని పెద్దసంఖ్యలో కంపెనీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.