Apple | న్యూఢిల్లీ, నవంబర్ 20: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,745.7 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,29.6 కోట్ల లాభంతో పోలిస్తే 23 శాతం ఎగబాకినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఉత్పత్తులకు దేశీయంగా డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
అలాగే సంస్థ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 36 శాతం ఎగబాకి రూ.49,321.8 కోట్ల నుంచి రూ.67,121.6 కోట్లకు చేరుకున్నది. యాపిల్ బ్రాండ్‌తో మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, సాఫ్ట్వేర్ ఉత్పత్తులను విక్రయిస్తున్నది. ఇదే సమయంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు కూడా రూ.63,397 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. దీంట్లో ఉద్యోగులపై పెట్టే ఖర్చు ఏడాది ప్రాతిపదికన 18 శాతం అధికమై రూ.2,599 కోట్లకు పెరిగినట్లు తెలిపింది.
మార్కెట్ విలువ ఆధారంగా యాపిల్ సంస్థకు రెండో స్థానం లభించినట్లు కౌంటర్‌పాయింట్ రీసర్చ్ వెల్లడించింది. 21.6 శాతం వాటాతో సామ్సంగ్ తొలి స్థానంలో ఉంది. మరోవైపు, ఒక్కో షేరుకు రూ.9.43 లక్షల చొప్పున 35 వేల షేర్లకు రూ.3,302 కోట్లను మధ్యంతర డివిడెండ్ రూపంలో చెల్లింపులు జరిపింది.